14, జనవరి 2011, శుక్రవారం

రావమ్మ మహాలక్ష్మి రావమ్మా!

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం తో సంక్రమించే శుభ దినం సంక్రాంతి.  అయితే సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంక్రాంతి. అంటే మనకు 12 రాశులున్నాయి కనుక, పన్నెండు సంక్రాంతులు వస్తాయి. అయితే అందులో మకర సంక్రాంతిని చాల పెద్ద ఎత్తున జరుపు కుంటాం.  పంట చేతికొచ్చిన రైతన్నకు, అతనికి సాయపడిన బసవడికి నిజమైన పండగ.  సూర్యుడు ఉత్తరాయణం లోకి అడుగిడుతాడు. అందువలన క్రమేపి సగటు ఉష్ణోగ్రత లో పెరుగుదల రోజు రోజుకు కనబడుతుంది. ఇది అందరికీ శుభ సూచకం.  
      కురుక్షేత్ర సంగ్రామంలో గాయపడిన కురు పితామహుడు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అర్జునుడు సమకూర్చిన అంపశయ్య మీద ఎదురు చూస్తుంటాడు.  ఇది తెలుగు వారికి పెద్ద పండుగ.  వీటిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని నాలుగు రోజుల పండుగగా జరుపుకుంటాం.  
      అల్లుళ్ళకి చాల డిమాండ్ ఈ సమయంలో. పూర్వం ఒక అల్లుడు గారు మామ గారితో మీ ఇంట రెండే రాత్రులుంటాను అన్నాడట. అమ్మయ్య బతికించాడు అని అత్తవారు అనుకున్నారట. కాని ఆ ఉద్దండుడు శివరాత్రి నుంచి సంకు రాత్రి దాకా అని చల్లగా చెప్పాడట.  
      వీధులలో తెల్లారగానే ఆడపిల్లలు ముఖ్యంగా కన్యామణులు కల్లాపి జల్లి, ముగ్గులు పెట్టి, వాటి మధ్య గొబ్బెమ్మల నుంచి పాటలు పాడతారు. హరిదాసులు కృష్ణార్పణం అంటూ భక్తి పాటలు పాడుతూ ఇల్లిళ్ళూ   తిరుగుతారు.  రైతులు గంగిరెద్దులని అలంకరించి "డూ!డూ! బసవన్నా! అయ్యవారికి దండం పెట్టు. అమ్మగారికి దండం పెట్టు" అని అన్ని వీధులూ తిరుగుతారు.  ముఖ్యంగా పల్లెలలో ఈ సరదాలు బాగా చూస్తూ ఉంటాం. కొందరు సంక్రాంతికి బొమ్మల కొలువులు కూడా పెడతారు. అయితే ఈ సాంప్రదాయాలు ఇప్పుడిపుడే కొంచెం తగ్గు ముఖం పడుతున్నాయి.
      సంక్రాంతి వర్ణనను చక్కని పాటగా తన భావుకతను నింపి కీ.శే. శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఉండమ్మ బొట్టు పెడతా చిత్రం కోసం రాసారు. బహుశ ఈ పాట వినని తెలుగు వారు అరుదు.  ఇదిగో మీ కోసం ఇక్కడ వ్రాస్తున్నాను.
 
రావమ్మ మహాలక్ష్మి రావమ్మా!
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని 
కొలువై ఉందువుగాని కలుముల రాణి     "రావమ్మ"

గురివింద పొదకింద గొరవంక పలికే
గోరింట కొమ్మల్లో కోయిలలు కులికే
తెల్లారి పోయింది పల్లె లేచింది 
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది       "రావమ్మ"

కడివెడు నీళ్ళు కల్లాపి జల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు    "రావమ్మ"

పాడిచ్చే గోవులకు పసుపు కుంకం 
పనిచేసే బసవనికి పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
కష్టించే కాపునకు కలకాలం సౌఖ్యం        "రావమ్మ"


అమెరికా లోని Raleigh, North Carolina కు చెందిన Triangle Area Telugu Association (TATA) వారి Telugu Nite కార్యక్రమం లో స్థానిక బాలికల మరియు యువ కళాకారుల సంక్రాంతి సంగీత దృశ్య రూపకం ప్రదర్శన ఈ విడియో లో చూడవచ్చు. నేపథ్యం లో పాడిన గాయనీమణులు శ్రీమతి లక్ష్మి పుచ్చా మరియు శ్రీమతి అనురాధ చివుకుల. ఈ విడియో స్థానిక అప్నా బజార్ సౌజన్యం తో. 

సంక్రాంతి శుభాకాంక్షలు - సూర్య నారాయణ వులిమిరి. 

4 కామెంట్‌లు:

  1. మీకు.. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు , శ్రేయోభిలాషులకు.. సంక్రాతి పండుగ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. శివ గారికి, ధన్యవాదాలు. మీకు, మీవారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. సూరి గారూ !

    మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    శి. రా. రావు
    సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  4. రావు గారు, ధన్యవాదాలు. మీకు, మీకుటుంబానికి మా సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి

Blog Junctions