10, డిసెంబర్ 2010, శుక్రవారం

సాయి సచ్చరిత్రను పాట రూపంలో తెలిపే "సాయి నక్షత్ర మాలిక"

శ్రీ షిరిడి సాయి సచ్చరిత్రను  "నక్షత్ర మాలిక" గా ఎవరో సాయి భక్తుడు వ్రాసాడు. మనకున్న 27 నక్షత్రాల లాగ ఈ పాటకు 27 చరణాలున్నాయి. ఈ పాటకు  బాణీ (tune) శ్రీ  జేసుదాసు గారు పాడిన "సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం" ఆధారం. మీరూ పాడటానికి ప్రయత్నించి శ్రీ సాయి బాబాను స్తుతించండి. ప్రతి చరణం తరువాత "సాయిరాం సాయిరాం శ్రీ సాయిరాం ..." అని ఈ పాట చివరన ఇచ్చిన ఆఖరి చరణం repeat అవుతుంది.

సాయి నక్షత్ర మాలిక 

1.    షిరిడీ సదనా శ్రీసాయి
       సుందర వదన శుభదాయీ
       జగత్ కారణా జయసాయి
       నీస్మరణే ఎంతోహాయీ                        || సాయిరాం ||

2.    శిరమున వస్త్రము చుట్టితివి
       చినిగిన కఫని తొడిగితివి
       ఫకీరువలె కనిపించితివి
       పరమాత్ముడ వనిపించితివి               || సాయిరాం ||

3.    చాందు పటేలును పిలిచితివి
       అశ్వము జాడ తెలిపితివి
       మహల్సా భక్తికి మురిసితివి
       సాయని పిలిచితె పలికితివి                 || సాయిరాం ||

4.    గోధుమ పిండిని విసరితివి
       కలరా వ్యాధిని తరిమితివి
       తుఫాను తాకిడిని నాపితివి
       అపాయమును తప్పించితివి              || సాయిరాం ||   

5.    అయిదిళ్ళలో భిక్షమడిగితివి
       పాపాలను పరిమార్చితివి
       బైజా సేవను మెచ్చితివి
      సాయుజ్యమును యిచ్చితివి               || సాయిరాం ||

6.    నీళ్ళను నూనెగ మార్చితివి
       దీపాలను వెలిగించితివి
       సూకర నైజం తెలిపితివి
       నిందలు వేయుట మాన్పితివి             || సాయిరాం ||

7.    ఊదీ వైద్యము చేసితివి
       వ్యాధులనెన్నో బాపితివి
       సంకీర్తన చేయించితివి
      చిత్తశాంతి చేకూర్చితివి                         || సాయిరాం ||

8.    అల్లా నామము పలికితివి
       ఎల్లరి క్షేమము కోరితివి
       చందనోత్సవము చేసితివి
       మతవిద్వేషాలు మాపితివి                  || సాయిరాం ||

9.    కుష్టురోగిని గాంచితివి
       ఆశ్రయమిచ్చి సాకితివి
       మానవధర్మము నెరపితివి
       మహాత్మునిగ విలసిల్లితివి                   || సాయిరాం ||

10.  ధునిలో చేతిని పెట్టితివి
       కమ్మరి బిడ్డను కాచితివి
       శ్యామా మొర నాలించితివి
       పాము విషము తొలగించితివి             || సాయిరాం ||

11.  జానెడు బల్లను ఎక్కితివి
       చిత్రముగా శయనించితివి
       బల్లి రాకను తెలిపితివి
       సర్వఙ్ఞుడ వనిపించితివి                        || సాయిరాం ||

12.  లెండీ వనమును పెంచితివి
       అహ్లాదమునూ పంచితివి
       కర్తవ్యము నెరిగించితివి
       సోమరితనము తరిమితివి                  || సాయిరాం ||

13.  కుక్కను కొడితే నొచ్చితివి
       నీపై దెబ్బలు చూపితివి
       ప్రేమ తత్వమును చాటితివి
       దయామయుడ వనిపించితివి             || సాయిరాం ||

14.  అందరిలోనూ ఒదిగితివి
       ఆకాశానికి ఎదిగితివి
       దుష్ట జనావళ్ని మార్చితివి
       శిష్టకోటిలో చేర్చితివి                            || సాయిరాం ||

15.  మహల్సా ఒడిలో కొరిగితివి
       ప్రాణాలను విడనాడితివి
       మూడు దినములకు లేచితివి
       మృత్యుంజయుడని పించితివి             || సాయిరాం ||

16.  కాళ్ళకు గజ్జెలు కట్టితివి
       లయబద్ధముగా ఆడితివి
       మధుర గళముతో పాడితివి
       మహదానందము కూర్చితివి               || సాయిరాం ||

17.  అహంకారమును తెగడితివి
        నానావళిని పొగడితివి
        మానవ సేవ చేసితివి
        మహనీయుడవని పించితివి              || సాయిరాం ||

18.  దామూ భక్తీని మెచ్చితివి
       సంతానమును యిచ్చితివి
       దాసగణుని కరుణించితివి
       గంగా యమునలు చూపితివి              || సాయిరాం ||

19.  పరిప్రశ్నను వివరించితివి
       నానాహృది కదిలించితివి
       దీక్షితుని పరీక్షించితివి
       గురుభక్తిని యిల చాటితివి                  || సాయిరాం ||

20.  చేతిని తెడ్డుగ త్రిప్పితివి
       కమ్మని వంటలు చేసితివి
       ఆర్త జనావళ్ని పిలిచితివి
       ఆకలి బాధను తీర్చితివి                       || సాయిరాం ||

21.  మతమును మార్చితె కసిరితివి
       మతమే తండ్రని తెలిపితివి
       సకల భూతదయ చూపితివి
       సాయి మాతగా అలరితివి                    || సాయిరాం ||

22.  హేమాదును దీవించితివి
       నీదు చరిత్ర వ్రాయించితివి
       పారాయణ చేయించితివి
       పరితాపము నెడబాపితివి                   || సాయిరాం ||

23.   లక్ష్మీబాయిని పిలిచితివి
        తొమ్మిది నాణెము లిచ్చితివి
        నవవిధ భక్తిని తెలిపితివి
        ముక్తికి మార్గము చూపితివి                || సాయిరాం ||

24.   బూటీ కలలో కొచ్చితివి
        ఆలయమును కట్టించితివి
        తాత్యా ప్రాణము నిలిపితివి
        మహాసమాధి చెందితివి                      || సాయిరాం ||

25.   సమాధి నుండే పలికితివి
        హారతి నిమ్మని అడిగితివి
        మురళీధరునిగ నిలిచితివి
        కరుణామృతమును చిలికితివి             || సాయిరాం ||

26.   చెప్పినదేదో చేసితివి
        చేసినదేదో చెప్పితివి
        దాసకోటి మది దోచితివి
        దశ దిశలా భాసిల్లితివి                         || సాయిరాం ||

27.   సకల దేవతలు నీవెనయా
        సకల శుభములు కూర్చుమయా
        సతతము నిను ధ్యానింతుమయా
        సద్గురు మా హృది నిలుపుమయా      || సాయిరాం ||

        సాయిరాం సాయిరాం జయ సాయిరాం
        ఓం సాయి శ్రీసాయి జయ సాయిరాం
        హరి ఓం హరి ఓం శ్రీ సాయిరాం
        జయ జయ జయ ఓం జయ సాయిరాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions