1, జూన్ 2011, బుధవారం

కలువలకు కమలాలకు తేడా ఏమిటి?

కలువ పువ్వు
తామర పువ్వు

"కలువ కు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం"  అయితే చాల మంది కలువకూ-కమలానికి తేడా లేదను కుంటారు. ఏది నిజం. కవిగారు ప్రాస కోసం వర్ణించారా? కాదు కాదు. కలువ పువ్వు (water lilly) రాత్రి వికసిస్తుంది. కమలము (lotus) పగలు వికసిస్తుంది. కలువలకు చంద్రుడు, కమలానికి (పద్మానికి) సూర్యుడు భౌతికంగా ఎంతో దూరం. అయినా వాటి మధ్య ఉన్న అనుబంధం గొప్పది. ఎందువలన అంటే, ఆ పుష్పాలు సూర్య చంద్రుల స్నేహ కిరణాలు సోకి విరిసి మురిసిపోతాయి. కమలం, పద్మం, తామర పువ్వు ఒకటే. కలువలు నీటిలో పుడతాయి.  కమలాలు బురదలో పుడతాయి.  అయితే సుమతీ శతకం లో బద్దెన కవి  "కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్" అని అన్నాడు. కమలానికి సూర్యుడు ఎంత మిత్రుడైనా వాటిని నీటిలోంచి బయటకు తీస్తే సూర్య రశ్మిని తాళలేక వాడి పోతుంది. అలాగే 'తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులె శత్రులగుట తథ్యము" అన్నది కూడా ముమ్మాటికీ నిజం.  'కుముదము' లేదా 'కువలయము' అంటే తెల్ల కలువ; ఏనుగు అని కూడా ఇంకొక అర్థం. కలువను ఉత్పలము అని కూడా అంటారు. నీలోత్పలము అంటే ముదురు నల్ల కలువ లేదా నీలి రంగు కలువ.
       పంకం (బురద) లో పుడుతుంది కనుక కమలాన్ని 'పంకజ' అంటారు. బురదలో పుట్టినా పద్మానికి ఆ బురద అంటదు. స్వచ్చంగా ఉంటుంది. అందుకే కమలం మన జాతీయ కుసుమం అయ్యింది. కమలం మరియు తామర పువ్వు ఒకటే. భగవద్గీత లో "తామరాకు మీద నీటి బొట్టులా" ఉండగలిగే వానిని స్థిత ప్రజ్ఞుడు అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపదేశించాడు. 
      మన పురాణములలో ఎన్నో పుష్పాల వర్ణన వుంది. అలాగే పుష్పాలతో పురాణ పురుషులను వర్ణిస్తారు. ఉదాహరణకు పద్మం తో లక్ష్మీ దేవికి, విష్ణువుకు సంబంధం వుంది. పద్మం లో పుట్టినది కనుక లక్ష్మిని 'పద్మజ' అంటాం. 'జ' అంటే పుట్టినది అని అర్ధం.  పద్మం బొడ్డులో పుట్టిన వాడు పద్మనాభుడు (విష్ణువు) లేదా పంకజ నాభుడు.  నీటికి ఉన్న పర్యాయ పదాలు - నీరు, జలము, వారి -తద్వారా ఇందులో పుట్టిన పద్మాన్ని వరుసక్రమం లో (respectively) నీరజ, జలజ, వారిజ అని అనవచ్చు. సరసు లో పుడితే సరసిజ.  వారిజవైరికులేశ = వారిజ (కమలం) - వైరి (శత్రువు); వారిజ వైరి = కమలానికి శత్రువు (సూర్యుడు); వారిజవైరి కులం = సూర్య వంశం; వారిజ వైరి కులేశ = సూర్య వంశ ప్రభువు; శ్రీ రాముడు సూర్య వంశస్థుడు.

11 కామెంట్‌లు:

  1. entomandi sandehaanni teerche post idi.so nice.

    రిప్లయితొలగించండి
  2. మంచి విషయాన్ని గుఱించి చెప్పారు అండి. కృతజ్ఞతలు :)

    రిప్లయితొలగించండి
  3. అనానిమస్ గారు, సందీప్ గారు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  4. కలువ ,కమలం భేదం బాగా చెప్పారు .వివరణ చాలా బాగుంది

    రిప్లయితొలగించండి
  5. రవిశేఖర్ గారు, ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. Vijay (vijay.jayanti1@gmail.com)6 ఏప్రిల్, 2012 2:19 AMకి

    Sir, I did not understand why Varija Vairi = Surya? WHy is Sun enemy of Lotus?

    రిప్లయితొలగించండి
  7. విజయ్ గారు, చక్కని సందేహం వెలిపుచ్చారు. కమలం నీటిలో వున్నంతవరకు సూర్యుడు కమలాప్తుడు. నీటినుండి వెలుపలకు వస్తే "కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్‌" అన్నట్లుగా ఆ సూర్యుడే శత్రువవుతాడు. మీ స్పందనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. కలువకు చంద్రుడు ఎంతో దూరం
    కమలానికి సూర్యుడు మరీ దూరం

    రిప్లయితొలగించండి

Blog Junctions