14, డిసెంబర్ 2010, మంగళవారం

నిచ్చెన మీద కవిత్వం వ్రాయమంటే...

చిన్నప్పుడు స్కూల్లో మేస్టారు గారు ఆవు మీద వ్యాసం వ్రాసుకొని రారా అంటే సదరు విద్యార్థికి దిక్కు తోచక వాళ్ళమ్మ కి చెప్పాడట. ఆవిడ సరాసరి వాళ్ళాయన దగ్గరకెళ్ళి "ఏమండీ! ఈ మాస్తారుకి రాను రాను మతి పోతున్నట్లుంది. ఆవు మీద వ్యాసం వ్రాయమంటే ఎలా. ఎంత కష్టమో ఆలోచించండి" అంది భర్తతో. అప్పుడా భర్త గారు "అంతేనా! ఒర్ బుజ్జీ! ఆవుని కదలకుండా పట్టుకుంటాను. నువ్వు నిచ్చెన వేసుకుని నీ వ్యాసం వ్రాసుకోరా" అని బ్రహ్మాండమైన సలహా ఇచ్చాడు.
      అదలా ఉంచితే నేను తిరుపతి వెటర్నరీ కళాశాలలో పోస్ట్-గ్రాడ్యువేషన్ చేసేటప్పుడు 'కవితల పోటీ' నిర్వహించారు. అయితే అక్కడి కక్కడే టాపిక్ ఇస్తారు. ఒక గంట వ్యవధిలో కవితను వ్రాయాలి. అయితే అంత సులువైన టాపిక్ కాదు ఇచ్చింది. "నిచ్చెన" మీద కవిత వ్రాయ మన్నారు. ఏదో ప్రేమ గురించో, ప్రేయసి గురించో రాయడం అయితే ఆదరగోట్టేసే వాడ్ని. ఈ ఊహించని కవితా వస్తువు 'నిచ్చెన' మీద కవిత వ్రాయడం ఎలా అని ఆలోచనలో పడ్డాను. అయినా మహాకవి శ్రీ శ్రీ గారు "కాదేదీ కవిత కనర్హం" అన్నట్లు, ఇచ్చిన వస్తువు నిచ్చెన మీద  ఏదో కుస్తీ పడి ఒక కవిత  రాసాను. అయితే తరువాత 'కాలేజి డే' నాడు బహుమతులు ప్రకటించినపుడు అవాక్కయ్యాను. నా కవితకు ప్రథమ బహుమతి వచ్చింది. ఆనాటి కాలేజి జ్ఞాపకాలను ఈ కవిత రూపం లో మరల గుర్తుకు తెచ్చుకుంటూ ఇదిగో 'నిచ్చెన' మీద కవిత.


అదుపు లేక హెచ్చు ధరల
కుదుపు తోన చచ్చు ప్రజలు
పొదుపు లేక వచ్చు లేమి
ప్రగతి కెకడ నిచ్చెనలు!


అధికారం చెల్లి,
అయ్యె ప్రతిపక్షపు బల్లి
గోడ మీది పిల్లి
నేడు చలో ఢిల్లీ
రాజకీయ నిచ్చెనలు


ప్రణాళికలు, ప్రమాణాలు   
పద బంధ ప్రహేళికలు
ద్వినాలుకల ప్రలాపాలు
వినాయకులకు నిచ్చెనలు


ప్రసంగాల ప్రహసనాలు
పనిలేని ప్రేలాపనలు
మాట తప్పు నేతలకు
అవకాశపు నిచ్చెనలు


వినోదాలు, విలాసాలు
పరీక్షలు, ప్రైవేటు చదువులు
వేటు పడ్డ విద్యాలయాలు
విద్యార్థుల నిచ్చెనలు  


వర్ణ వర్గ విచక్షణలు
వశీకరణ క్షిపణులు
కావివి మనకు సోపానాలు
కాటేసే విష సర్పాలు
విభేదాల నిచ్చెనలు

2 కామెంట్‌లు:

Blog Junctions