13, అక్టోబర్ 2010, బుధవారం

దేవీ నవరాత్రులు

చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రునితో కలసివుందే నక్షత్రాన్ని బట్టి ఆమాసం పేరు వస్తుంది పౌర్ణమి తో కూడిన అశ్వినీ నక్షత్రం గల మాసం ఆశ్వయుజ మాసం ఇదే శరదృతువుకు లేదా చలికాలానికి ప్రారంభం ఈ మాసం లో శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు గల తొమ్మిది (నవ రాత్రులను శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు దక్షిణాయనంలో ఇది హిందువులకు ఎంతో ప్రాముఖ్యత గల పండుగ ఉపనిషద్వాక్యమైన 'మాత్రు దేవోభవ కు ప్రతిబింబంగా మన సంస్కృతిని పరివారాన్ని సమైక్యతను పరిరక్షించే పవిత్ర స్త్రీ మూర్తిని ఈ శరన్నవరాత్రులలో సర్వ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి రూపంలో శక్తి ప్రదాతయైన దుర్గగా జ్ఞానప్రదాతయైన సరస్వతిగా ఐశ్వర్య ప్రదాతయైన లక్ష్మిగా పూజిస్తాము.

ఈ పర్వదినాలను మనం దసరా పండుగగా జరుపుకుంటాము 'దసరా' లేదా 'దశహర' అంటే దశ (పది) ని హరించడం, అంటే
రావణుని పదితలలను హరించి శ్రీరాముడు విజయాన్ని పొందిన రోజు విజయదశమి అంతే కాదు మహాభారతంలో పాండవులు విరాటుని కొలువులో అజ్ఞాతవాసం చేసే సమయంలో కురుసైన్యం ఉత్తర దక్షిణ గోగ్రహణం జరుపగా శాపవశాన బృహన్నల (పేడి) గా ఉన్న పాండవ మధ్యముడు అయిన అర్జునుడు శమి వృక్షం పై తాము భద్రంగా దాచిన ఆయుధాలను దించి గాండివ ధారియై కురుసేనలను చెండాడి విరాటరాజు యొక్క గోవులను సంరక్షించి విజయంతో తిరిగి వచ్చినది కూడా విజయదశమి నాడే. అందుకే ఈ విజయదశమి రోజు మనం ఆయుధపూజ చేస్తాము అయితే కాలక్రమేణా ఆయుధాలకు బదులు వాహనాలకు తమతమ వృత్తులలో ఉపయోగించే ఉపకరణాలకు లేదా పనిముట్లకు ఆఖరికి ప్రస్తుత కాలంలో కంప్యూటర్లకు ఆయుధపూజ చేస్తున్నాము
మనకు దసరాలలో బొమ్మలకొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. కొందరు సంక్రాంతికి పెడతారు రకరకాల బొమ్మలను కొలువుగా తీర్చిదిద్ది పిల్లలను ముత్తైదువులను పేరంటానికి పిలిచి రోజుకొక తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు పాటలతో భజనలతో ప్రార్థనలతో జగదంబను స్తుతిస్తారు . దసరాలలో నవమిని మహానవమి అంటాం ఇది అత్యంత ప్రధానమైన రోజు ఈ దినం జగదంబను తప్పనిసరిగా పూజించాలి దశమినాడు పునః పూజ మరియు ఉద్వాసన జరుపుతారు విద్యార్ధులు తదితర చదువరులు మూలనక్షత్రంలో సరస్వతీ పూజ చేయాలి ఎక్కువగా ఉత్తరభారతీయులు విజయదశమినాడు శమీ పూజ చేస్తారు ఈ రోజు పురజనులు ఊరి సరిహద్దులు దాటి ఈశాన్యదిక్కుగా ప్రయాణించి శమీపూజ నిర్వహించి వెనక్కి తిరిగి వస్తారు దీనినే సీమోల్లంఘన అంటారు. అంటే సీమ (సరిహద్దు) ను ఉల్లంఘించడం (దాటడం). విజయదశమి నాడే షిరిడి సాయిబాబా గారు మహా సమాధి చెందారు

ఈ దసరా నవరాత్రులు ఎంతో సరదాగా సందడిగా ఉండి మనలో భక్తిని స్నేహాన్ని సౌభ్రాతృత్వాన్ని కలిగిస్తాయి. అనంత నామాలు రూపాలు గల అమ్మవారిని ఏ నామంతోగాని ఏ రూపంతో గాని భక్తి -ప్రపత్తులతో ఆరాధించే వారికి సర్వము మంగళకరము, శుభప్రదము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions