13, అక్టోబర్ 2010, బుధవారం

గురు పూర్ణిమ


మన (చాంద్రమాన) పంచాంగం లో ఆషాఢ మాసం (జులై-ఆగస్టు) లో వచ్చే పౌర్ణమిని "గురు పూర్ణిమ" లేదా "వ్యాస పూర్ణిమ" గా పరిగణిస్తారు. ఇది వేద వ్యాసుని జన్మ దినం (వ్యాస జయంతి).  ఇతడు పరాశర మహర్షికి, సత్యవతికి కృష్ణ వర్ణం (నల్ల రంగు) తో ఒక ద్వీపంలో జన్మించాడు. కనుక "కృష్ణ ద్వైపాయనుడు" అని పిలవబడ్డాడు.  అయితే, తన తండ్రియైన పరాశర మహర్షి సంకల్పించి ప్రోగు చేసిన వేద రాశులను నిత్య కర్మలలో, క్రతువులలో వాటివాటి ఉపయోగాన్ని బట్టి  ఋగ్-యజుర్-సామ-అధర్వణ అను నాలుగు వేదములుగా విభజించి లేదా వేర్పరచినందువలన "వేద వ్యాసుడు" అను పేర సార్ధక నామధేయుడైనాడు. తదుపరి బ్రహ్మ అనుజ్ఞతో, సరస్వతీ కటాక్షంతో విఘ్నాధిపతియైన గణేశుడు వ్రాయగా చతుర్వేదములలోని సారం ప్రతిబింబించేవిధంగా ఘనతకెక్కిన మహాభారత ఇతిహాసకావ్యాన్ని రచింపజేసాడు. అందుకే భారతాన్ని "పంచమవేదం" అన్నారు.  ఇవే కాక, వేద వ్యాసుడు మనకు అష్టాదశ (పద్ధెనిమిది) పురాణాలను, మరెన్నో పురాణేతిహాసాలను ప్రసాదించిన పూజ్యుడు, తొలి గురువు. విష్ణుతేజం తో జన్మించిన ఈ మహనీయుని సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారంగా భావిస్తారు.  అందుకే శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో "వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే" అని తలచుకుంటారు.

అటువంటి వేద వ్యాసుడు మనకు తొలి గురువు.  "గురు" అన్న పదం లో గల రెండు అక్షరాలలో "గు" అనగా "తమస్సు" లేదా "చీకటి",  "రు" అనగా "చీకటిని తొలగించే వాడు", వెరసి "గురువు" అనే వ్యక్తి మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతి తో వెలుగును నింపేవాడు అని వివరణ చెప్పవచ్చు. ఇదే "తమసోమా జ్యోతిర్గమయ", అంటే "తమస్సు లేదా చీకటి నుండి జ్యోతి లేదా వెలుగు లోనికి" అని.  గురువు త్రిమూర్త్యవతారం కూడా. ఎందుకంటే బ్రహ్మవలె మనలో జ్ఞాన బీజం సృష్టించి, విష్ణువువలె దాన్ని స్థితిని కొనసాగించి, మహేశ్వరుని వలె మనలోని అజ్ఞానతిమిరాన్ని నశింపజేస్తాడు.  అందుకే "గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుర్ దేవో మహేశ్వరః అన్నాం.  అటువంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, అటువంటి గురువుకు నమస్కరించెదము గాక. దాన్నే "గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః" అని గురుశ్లోకం లో రెండవ పంక్తికి అర్ధం.

పుట్టిన ప్రతి బిడ్డకు తల్లే తొలి గురువు. తరువాత చెప్పుకోవాలంటే తండ్రి, తదుపరి అధ్యాపకుడు.  అందువలనే "మాతృ దేవోభవ! పితృ దేవోభవ! ఆచార్య దేవోభవ! " అన్నారు. వేదాలలోను, జ్యోతిషశాస్త్రంలోను దేవతల గురువైన "బృహస్పతి" ని గురువుగా తలుస్తారు. అతనిని ఒక గ్రహం గా గణించి అతని పేర "బృహస్పతి వారం" లేదా "గురు వారం" ఏర్పరచుకున్నాం.  

ప్రతి వ్యక్తికీ గురువు అవసరం ఉంది.  శిష్యులు లేని గురువులుండొచ్చు. కాని గురువు లేని శిష్యులుండరు.  పరిపూర్ణ అవతారుడై, జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడ కుచేలుడు (సుధాముడు) సహాధ్యాయుడుగా సాందీపని మహర్షి వద్ద శిష్యుడై గురు శుశ్రూష చేశాడు. అంతేకాక కురుక్షేత్ర సంగ్రామారంభంలో పార్థుడు శ్రీకృష్ణుని ప్రార్ధించి "భగవత్-గీతోపదేశం" పొందాడు. అందుకే "కృష్ణం వందే జగద్గురుం" అంటాం.

మనకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, లేదా బోధకులు అంతా గురువులే అయినా వీరందరు "సద్గురువులు" లేదా నిజమైన గురువులు కాలేరు.  "సద్గురువు" లకు ఒకే జేవిత పరమావధి మరియు లక్ష్యం వుంటుంది. అదేంటంటే, శిష్యుడుగా ఉపాసన పొందినవానికి "ఆత్మశోధన" ద్వారా, అంటే తనను తాను తెలుసుకొని, తద్వారా భగవంతుని తెలుసుకొనేలా చేయగల పవిత్రమూర్తి "సద్గురువు".  ఈ సద్గురువు కూడ ఇదే పద్ధతిలో తనను, భగవంతుని తెలుసుకున్నవాడై ఉండాలి. జ్ఞాన సంపన్నుడైన సద్గురువు నామ స్మరణ వలన శిష్యులకు జీవన్ముక్తి మరియు మోక్షప్రాప్తి కలుగుతాయి. అందుచేత ఆశయ సాధనకు ప్రతివొక్కరూ సద్గురువును ఆశ్రయించాలి.  ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన గురు ముఖతః విషయాలను గ్రహించి స్వీకరించాలి.  మన భరతావనిలో ఎందరో సద్గురువులు మనకు జ్ఞానభిక్ష నొసగి ముముక్ష మార్గమును చూపిస్తున్నారు.  అయితే సద్గురువులైన వారు చీనాంబరాలను, అధికారాలను, ఆడంబరాలను ఆశించరు. పాదపూజలు, కానుకలు కోరరు. వారు కోరేది కేవలం శ్రద్ధ, సహనము, నిర్మలమైన భక్తి మరియు అచంచల విశ్వాసము.  గురువును దైవంగా కొలిచే ఈ అత్యంత ప్రశస్తమైన గురు పూర్ణిమ నాడు సద్భావనతో మనసును కేంద్రీకరించి మరోమారు వేదవ్యాసుని ఈ విధంగా తలచుకుందాం.

"వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రం అకల్మషం, పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం"

అంటే, వశిష్టుని మునిమనుమడైన, కల్మషరహితుడైన శక్తికి మనుమడైన, పరాశరుని కుమారుడైన, శుకమహర్షి తండ్రియైన ఓ! వ్యాస మహర్షీ! నీకు వందనము.  ఈ గురు పౌర్ణమి రోజున మీరు కూడా సద్గురువులను సేవించి వారి ఆశీస్సులను పొందుదురు గాక!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions