8, నవంబర్ 2010, సోమవారం

చదువు గతి ఇంతే - 'మనసు కవి' ఆత్రేయ గారికి క్షమాపణలతో ఈ పేరడీ

నేను తిరుపతి వెటర్నరీ కాలేజి లో యమ్వీ ఎస్ సి చేసే రోజులలో మా కళాశాల వార్షికోత్సవానికి నా అభిమాన 'మనసు కవి' ఆత్రేయ గారిని ఆహ్వానించాము.  కాలేజి చదువుల గురించి ఆయన ప్రేమ నగర్ చిత్రానికి వ్రాసిన 'మనసు గతి ఇంతే' కు పేరడీ వ్రాసి ఆయనకు వినిపిద్దామనుకున్నాను. కాని ఆయన మద్రాసు నుండి రావడం చాల ఆలస్యం అయింది. మా కార్యక్రమం ఇంచుమించు అయిపోయింది. ఆయన ను పలకరించి ఆటోగ్రాఫ్ అడుగుతూ "మనసు కవి గారూ! ఏదైనా మనసుకు హత్తుకునేలా రాయండి" అని నా ఆటోగ్రాఫ్ పుస్తకం అందించాను. ఆయన నా వంక ఒకసారి నవ్వుతూ చూసి 'మనసుకు ఏమీ అంటించు కోకు! అది పగిలే దాక వదలదు' అని రాశారు. ఆ మాటలు ఈ రోజు వరకు ఇంకా గుర్తున్నాయి. శ్రీ ఆత్రేయ గారికి క్షమాపణలతో ఈ పేరడీ -
 
చదివితే మరచి పోగలను - చదవనివ్వరు 
మరచిపోతే చదవ గలను - మార్కులివ్వరు
హు.హు.హు.హు.


చదువు గతి ఇంతే - మనకు పిడి వింటే 
చదువున్న మనిషికీ జాబు లేదంటే ||చదువు||


నోట్సులిస్తే బోధపడదు - 
బుక్స్ చదివే బ్రైను లేదు 
కాపీలసలె చేత కావు - 
దొరికిపోతే పరువుచేటు.. ||చదువు||


అన్నీ బుక్సేనని తెలుసు - 
అవీ కొంత వేస్టేనని తెలుసు 
తెలిసీ చదివీ ఫెయిలవడం లో - 
చేదునిజం ఎవరికి తెలుసు ||చదువు||


మరో మార్చి ఉన్నదో లేదో - 
ఈ సిలబస్ అప్పుడేమౌతుందో |మరో మార్చి|
మనకు చదువే తీరని శిక్షా ! 
గురువులిలా తీర్చు కున్నారు కక్షా !
చదువు గతి ఇంతే -మనకు పిడి వింతే!
చదువున్న మనిషికీ జాబు లేదంతే
చదువు గతి ఇంతే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions