27, నవంబర్ 2010, శనివారం

నిద్ర పోయే ముందు భగవంతుని ఏమని ప్రార్థించాలి?

నిద్ర పోయే ముందు దైవ ప్రార్థన చేసి లేదా స్మరణ చేసి పడుక్కోవడం చిన్నప్పటి నుండి అలవాటు. ముఖ్యం గా మన నిత్య కర్మలలో చేసిన తప్పులను భగవంతునికి విన్నవించుకుని క్షమించమని అడుగుతాం. ఈ శయన సమయ శ్లోకం ఈశ్వర ప్రార్థన. అయితే ఈ శ్లోకం కు మూలం జగద్గురు ఆది శంకరాచార్యులు వ్రాసిన 'శివ అపరాధ క్షమాపణ స్తోత్రం' లోనిది.  భక్త కన్నప్ప చిత్రంలో కిరాతార్జునీయం (వేటూరి గారు వ్రాసినది) పద్యాలలో కిరాత వేషధారియైన ఈశ్వరుని చేతిలో అపజయం పొందిన అర్జునుడు పరమశివువి శరణాగతిని కోరే వర్ణనలో ఈ శ్లోకం వినిపిస్తుంది.  ఇదే శ్లోకం శ్రీ షిరిడీ సాయిబాబా గారి ఆ(హా) రతులలో కూడా ఉంది. అయితే శివునికి బదులుగా సాయినామం వస్తుంది ఆఖరిలో. కార్తీక మాసం సందర్భం గా నాకు నచ్చిన ఈ శ్లోకం యొక్క వివరణ ఈ దిగువన ఇస్తున్నాను.  

కర చరణ కృతం వాక్ కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహిత మవిహితం వా సర్వమే తత్ క్షమస్వా
జయ జయ కరుణాబ్దే  శ్రీ మహాదేవ శంభో  
 

శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి గళంలో ఈ క్రింది లంకెలో వినవచ్చు.
http://www.raaga.com/play/?id=228737
 

ప్రతి పదార్ధం: కర = చేతులు; చరణ = పాదములు; కృతం = చేసిన; వాక్ = మాటలు; కాయ = శరీరం; జం = పుట్టినది లేదా సంభవించినది / జరిగినది; కర్మ = చేతలు; వా = మరియు; శ్రవణ = వినుట/వినడం; నయన = కళ్ళు; మానసం = మనస్సు; అపరాధం = తప్పు/నేరము; సర్వం = అన్నియు; తత్ = అవి; క్షమస్వ = క్షమించుము; కరుణ = దయ; అబ్ది = సముద్రము. కొందరు "విహితమవిహితం" కు బదులు "విదితమవిదితం" అని చెబుతారు. విహితం/విదితం, విదితం/అవిదితం ఇంచు మించు ఒకే అర్ధాన్ని సూచిస్తాయి. కొన్ని చోట్ల 'వాక్' బదులు 'వా' అని మాత్రమే ఇవ్వబడింది. కాని వాక్కు కూడా ఉంది ఈ శ్లోకం లో.

తాత్పర్యం: ఓ కరుణా సముద్రుడైన శంకరా! నేను నా చేతుల వలన, పాదాల వలన, మాటల ద్వారా, మరియు శరీరం వలన (తగలడం చేత) గాని, వినికిడి వలన గాని, చూచుట వలన గాని, మనస్సు వలన గాని, తెలిసి గాని, తెలియక గాని, ఏదయినా అపరాధం చేసి నట్లయితే అవన్నీ క్షమించవలసినది. (నిద్ర పోయే ముందు ఈ శ్లోకం తో ఈశ్వరుని స్మరిస్తారు, అందువలన దీనిని శయన సమయ శ్లోకం అంటాం)  


స్వగతం: శ్లోకాలు తక్కువ పదాలతో ఎక్కువ, ఉన్నతమైన లేదా లోతైన అర్ధాన్ని వివరిస్తాయి. తెలిసో తెలియకో మనం చాల తప్పులు చేస్తుంటాం. అవి ఇంకొకరిని భౌతికం గా గాని, మానసికం గా గాని, మన చర్యల ద్వారా (ప్రత్యక్షం గా లేదా పరోక్షం గా) గాని బాధ పెడతాయి. అది మనకు కనిపించని భగవంతునికి జరిగిన అపరాధం అయితే చెంపలు వేసుకుని ఈ శ్లోకం చదివి, అమ్మయ్య దేవుడు క్షమించేసాడు అని సరి పెట్టుకుంటాం. కాని అదే మనకు కనిపించే వ్యక్తులని బాధ పెడితే ఎంతమంది పశ్చాత్తాప పడుతున్నారు.  మనం పురాణాలలో, ఇతిహాసాలలో, భగవన్నామ స్మరణం లో నేర్చుకున్న విజ్ఞానాన్ని/విచక్షణ ను పరుల బాధలను ఉపశమింప జేయడానికి ఉపయోగిస్తే అందరూ సుఖంగా ఉంటారు కదా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions