13, అక్టోబర్ 2010, బుధవారం

అర్ధరాత్రి స్వాతంత్ర్యం

భారతదేశానికి 1947 ఆగస్టు 15 అర్థరాత్రి వచ్చింది స్వాతంత్ర్యం. వంగ-సంస్కృత పద సముఛ్చయంతో బంకించంద్ర ఛటర్జీ విరచిత "వందేమాతరం" గీతాన్ని తొలుత నోబెల్ పురస్కార గ్రహీత, "విశ్వకవి" అని వాసికెక్కిన రవీంద్రనాథ టాగూర్ 1896 లో భారత జాతీయ కాంగ్రెస్ సభలో ఆలపించగ, తదుపరి ప్రతి దేశభక్తుని గళంలోనూ ప్రతిధ్వనించి జాతీయత ఆపాదించబడింది. అయితే కొన్ని వివాదాల వలన జాతీయగీతం కాలేకపోయింది. అటు తరువాత రవీంద్రుని కలం నుండి జాలువారిన "జనగణమన" సర్వజన ఆమోదం పొంది భారతదేశ జాతీయగీతం అయింది. 1901 లో మహమ్మద్ ఇక్బాల్ వ్రాసిన "సారే జహాన్ సె అఛ్చా" కూడ విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆ సమయంలో తెలుగు నేపథ్యగాయకులు శ్రీఘంటసాల ఆలపించిన ప్రైవేట్ గీతాలైన "స్వాతంత్ర్యమె నాజన్మహక్కని చాటండి. నిరంకుశంబగు శక్తులెరిగినా నిశ్చయముగ నిదురించండి". "అమ్మా! సరోజినీ దేవి! పరిపూర్ణ సువర్ణకళామయజీవి" వంటివి తెలుగువారికి చిరపరిచితాలు. తదుపరి వచ్చిన దేశభక్తి గీతాలలో సినీ రంగాన "పాడవోయి భారతీయుడా!", తెలుగు కవులు వ్రాసిన ప్రముఖ లలిత గీతాలలో గురజాడ అప్పారావు వ్రాసిన "దేశమును ప్రేమించుమన్నా", రాయప్రోలు సుబ్బారావు వ్రాసిన "ఏదేశమేగినా ఎందుకాలిడినా", బలివాడ రజనీకాంతరావు వ్రాసిన "పసిడిమెరుంగుల తళతళలు", శంకరంబాడి సుందరాచారి విరచిత "మాతెలుగు తల్లికి మల్లెపూదండ" మనందరికి తెలిసినవే.
       తెలుగు వారిలో కొందరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు: పింగళి వెంకయ్య - మన జాతీయ (త్రివర్ణ) పతాకపు నిర్మాత. మన మువ్వన్నె జండాలో కాషాయం, (ధైర్యం, నిస్వార్ధం) తెలుపు, (శాంతి, సత్యం) ఆకుపచ్చ (సుభిక్షత, సంవర్ధకత) రంగులతో మధ్య ౨౪ పుల్లలుగల ధర్మానికి చిహ్నమైన అశోకచక్రం తో గల భారత జాతీయ జండాను ఈయన ఖాదీగుడ్డపై తయారుచేసారు. మరొక తెలుగు వీరుడు పొట్టి శ్రీరాములు -తన ఆమరణ నిరాహార దీక్షతో అసువులుబాసి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని పొందేట్టుచేసి స్వాతంత్ర్య సముపార్జనకు దోహదంచేసిన నిస్వార్ధమైన తెలుగువాడు; వీరుకాక, శ్రీటంగుటూరి ప్రకాశం పంతులు ("ఆంధ్రకేసరి" బిరుదుగల ఈ ప్రతిభాశాలి స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి); శ్రీమతి దుర్గాభాయి దేశ్‍ముఖ్ (ఆంధ్ర మహిళాసభ వ్యవస్థాపకురాలు); శ్రీపుచ్చలపల్లి సుందరయ్య (ఇతని బిరుదు "కమ్యూనిష్టు గాంధీ", తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవీరుడు); శ్రీభోగరాజు పట్టాభి సీతారామయ్య (ఆంధ్రాబ్యాంకు స్థాపకుడు-1928); శ్రీమతి సరోజినీ నాయుడు (తెలుగింటి కోడలు, "కవి కోకిల" బిరుదు, తొలి మహిళా గవర్నరు); శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య (గాంధేయవాది, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్య మంత్రి) మొదలగువారు.
       వీరేకాక ప్రత్యేకంగా చెప్పాలంటే, మన మాతృభూమిని "విభజించి-పాలించు" అనే సిద్ధాంతంతో నిర్వీర్యులని చేయనెంచిన తెల్లదొరల దౌర్జన్యాలను ఎదుర్కోవడం కోసం తను ప్రేమించిన సీతను వదలి, ఆమె పేరును మాత్రం తన పేరునజేర్చుకున్న "మన్నెం వీరుడు", "తెలుగు సింహం" అయిన అల్లూరి సీతారామరాజు. గంటం దొర, మల్లుదొర అనే అన్నదమ్ములైన అనుచరులతో "రంప పితూరీ" తో ప్రసిద్ధిగాంచి, అమ్ములుకురిపించి బ్రిటిష్ పాలకులను గడగడలాడించి, తదుపరి రూథర్‍ఫర్డ్ అనే తెల్లదొర తుపాకి గుళ్ళకు గుండెలెదురొడ్డి 27 సంవత్సరాల పిన్న వయసులోనే అసువులు బాసిన అమరవీరుడు. ఇతని పాత్ర ఇతివృత్తంగా నటశేఖర కృష్ణ నిర్మించి, నటించగా, ఉత్తేజం, ఉద్వేగంతో మహాకవి శ్రీశ్రీ కలంనుండి జాలువారి, అమరగాయకుడు ఘంటసాల గంభీర గళం నుండి గర్జించిన గీతం "తెలుగువీర లేవరా" విని ఇప్పటికీ స్పందించని తెలుగువారుండరు. అల్లూరి ప్రతిభ స్వాతంత్ర్య సమరంలో తెలుగు వారి పౌరుష ప్రతాపాలకొక మచ్చుతునక.

జైహింద్!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions