15, నవంబర్ 2010, సోమవారం

"కేన్సర్" అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది?

విజ్ఞాన శాస్త్రం కు  సంబంధించిన వ్యాసాలు పూర్తిగా తెలుగులో వ్రాయడం కొంచెం కష్టమైన పని. అయితే వీలయినంత తక్కువ ఆంగ్ల పదాలతో నా ఆలోచనలు తెలియజేయడం ఈ వ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం. మూడు భాగాలుగా వచ్చే ఈ వ్యాసం లో కేన్సరు గురించి మౌలిక సమాచారం, కేన్సరును తొలగించడానికి వాడే ముఖ్యమైన పద్ధతులు, కేన్సరు గల వారు లేదా, కేన్సరు కు మూలమైన కారణాలను లేదా కారకాలను ఎలా నిరోధించాలో ఇందులో చేరుస్తున్నాను.

కేన్సరు అనేది కొత్త వ్యాధికాదు. పురాతనకాలంలో దీన్ని "రాచపుండు" అని అనేవారు. అయితే సామాన్యులకు కాక రాజులకే ఎందుకు వస్తుంది? బహుశా రాజుల భోగలాలస జీవితం వలనేమో. ఇంకొకటైనా కావచ్చు. రాజులకొస్తే అది ప్రజలందరికీ వార్తా విశేషం, కాని సామాన్య పౌరుడికొస్తే ఎవరు పట్టించుకుంటారు. అదలా వుంచితే, కేన్సర్ అనే పదానికి గ్రీకులో "యెండ్రకాయ" లేదా "పీత" అని అర్థం. పీతకు ఎలా అయితే శరీరం మధ్యనుండి నలువైపులా విస్తరించినట్లు కాళ్ళు ఉంటాయో, కేన్సరు అదే పద్ధతిలో వ్యాప్తిచెందటం వలన దానిని "కేన్సరు" గా నామకరణం చేసారు. కర్కాటక రాశిని ఆంగ్లంలో కేన్సర్ అంటారు, దాని రాశిగుర్తు పీత. హిప్పోక్రేట్స్ (క్రీ.పూ.460-370) అనే గ్రీకు తత్వవేత్త దీన్ని "కార్కినోమా" అని వర్ణించాడు. ఈ పదాన్నే ఆంగ్లంలో "కార్సినోమా" అంటారు.
          అయితే అప్పటికీ ఇప్పటికీ శాస్త్రీయ విజ్ఞానం చాల అభివృద్ధి చెందింది. కేన్సరు గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. మౌలికంగా, కేన్సరుకు కారణాలు మన జీవితసరళి (Life Style). ముఖ్యంగా మూడు స్థూలమైన కారణాలు కేన్సర్ ను కలుగజేస్తాయి.  అవి భౌతికమైనవి (physical -ఉదా. రేడియేషన్ [radiation], అతినీలలోహిత కిరణాలు[ultra-violet rays]), రసాయనిక పదార్థాలు (chemicals), జీవ సంబంధమైనవి (biological -ఉదా. బాక్టీరియా, వైరసులు, కొన్ని పరాన్నజీవులు). ఈ మూడు రకాల కారకాల (factors) తో పరస్పర సంబంధం వలన మన శరీరంలోని మౌలికమైన కణాల అనువంశిక పదార్థమైన జన్యువు (డిఎన్‍ఎ) లో ఉత్పరివర్తనాలు (mutations) వస్తాయి. అయితే ప్రతిమనిషీ దైనందిన జీవితంలో ఎన్నో కారకాలను భౌతికమైనవైతే చర్మంద్వారా, రసాయన పదార్థాలయితే కాలుష్యమైన గాలిని పీల్చడం వలన లేదా కలుషితపదార్థాలు తినడం లేదా తాగడం ద్వారా, జీవసంబంధ కారకాలను స్పర్శ, సంపర్కం ద్వారా లేదా నీరు, ఆహారం ద్వారా సంక్రమించు కుంటాడు. ఈ కారకాలు వలన ఏర్పరడిన మ్యుటేషన్స్ మన శరీరంలో నిద్రాణంగా ఉంటాయి. ఈ మార్పులు జన్యుపదార్థం లో శాశ్వత మార్పులు కలిగిస్తాయి. ఇలా నిద్రాణంగా వున్న వికృత కణాలకు సరియైన కేన్సరు ప్రేరకాలు (tumor promoters) పురికొల్పడం వలన అవి విపరీతంగా స్పందించి అసందర్భ కణ విభజన (cell division) కు లోనవుతాయి. ఇటువంటి కణ విభజనను "ప్రొలిఫిరేషన్" (proliferation) అంటారు.  కొవ్వు పదార్థాలు (fats), అత్యధికమైన కేలరీలు ఈ నిద్రాణమైన కణాలను స్పందింపజేసి వాటిని అనియంత్రితంగా విభజన చెందించి, కణజాల పరిమాణాన్ని పెంచి ముందుగా "వాపు" (swelling) లా కనిపిస్తాయి. వీటి పరిమాణం ఇంకాపెరిగినాక దీన్నే "ట్యూమర్" లేదా "కంతి" అంటాం. ఎక్కువ శాతం కేన్సర్లు రసాయన పదార్థాలు మనశరీరం లో చేరిన తరువాత సంభవిస్తాయి. సహ కుటుంబీకులలో అనువంశికంగా వచ్చే కేన్సరుల శాతం చాల తక్కువ. మొత్తానికి మనకు జన్యు-పర్యావరణల (gene-environment) పరస్పర సంబంధం (interaction) వలన ఎక్కువగా కేన్సర్లు వస్తాయి అని చాల పరిశోధనలవలన తెలిసింది.  
[సూచన: ఈ వ్యాసం కేన్సరు గురించి అవగాహన కోసం వ్రాసాను. నిర్దిష్టమైన కేన్సరుకు సంబంధించిన సమాచారం కోసం నిపుణులను సంప్రదించవలెను]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions