3, నవంబర్ 2010, బుధవారం

దీపావళి (Deepavali)

దీపాలవెల్లి మన దీపావళి

దీపావళి అంటే దీపాల వరుస. అందాల ప్రమిదల, ఆనంద జ్యోతుల ఆశలు వెలిగించు దీపాలవెల్లి ఈ చీకటి వెలుగుల రంగేళి. చాంద్రమానం ప్రకారం ఆశ్వయుజ మాసం ఆఖరి రోజు, అదే అమావాస్య నాడు వస్తుంది దీపావళి. ఉత్తర భారత దేశంలో దీనిని అయిదు రోజుల పండుగగా జరుపు కుంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం లో 13 వ రోజు - ధన త్రయోదశి; 14 వ రోజు - నరక చతుర్దశి; దాని తరువాత వచ్చే అమావాస్య - దీపావళి అమావాస్య; మరునాడు వచ్చే కార్తీక మాసపు తొలి రోజు పాడ్యమి ని "బలి పాడ్యమి" అని, దాని తరువాతి రోజును "యమ ద్వితీయ" లేదా "భాయి బూజ్" అని అంటారు. క్షీర సాగర మధనం జరిగినపుడు పదమూడవ రోజయిన త్రయోదశి నాడు ధన్వంతరి వ్యాధులను నిరోధించగల మూలికలుగల ఆయుర్వేద కలశాన్ని చేకొని బయటకు వచ్చాడని ప్రతీతి.

నరక చతుర్దశి: భూదేవి కుమారుడైన నరకాసురుడు ప్రాగ్ జ్యోతిషపురాన్ని(అస్సాం) రాజధాని గా చేసుకుని కామరూప దేశాన్ని పాలించేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరం వలన ఈ రాక్షసుడు విజ్రుమ్భించి ప్రజలను, దేవతలను బాధిస్తూ ఉండేవాడు. పదహారు వేల స్త్రీలను చెరబట్టాడు. ఈ రాక్షసుని బారినుండి కాపాడమని ఇంద్రుని తో సహా అందరు దేవతలు శ్రీ కృష్ణుని తో మొరపెట్టు కుంటారు. శ్రీ కృష్ణుడు సత్యభామ సమేతం గా నరకుని పై దండెత్తుతాడు. నరకుని తో జరిగిన పోరులో శ్రీ కృష్ణుడు మూర్చ పొతే సత్యభామ విల్లంబులు ధరించి నరకుని సంహరిస్తుంది. తప్పు చేస్తే తల్లి అయినా దండించడానికి వెనుకాడ కూడదని దీని వలన అర్ధం అవుతుంది. నరకుడు చెరబట్టిన వనితలకు శ్రీ కృష్ణుడు స్వేచ్చ నిచ్చి వారిపై పడిన మచ్చను తొలగించు కోవడానికి వారందరినీ భార్యలు గ స్వీకరిస్తాడు.


దీపావళి: దీపావళి నాడు లక్ష్మి పూజ చేస్తారు. ఈ రోజు లక్ష్మీ దేవి కళకళ లాడే ఇంట అడుగు పెడుతుందని అందరి నమ్మకం. అందువలన ప్రతి ఒక్కరు తమ తమ ఇళ్ళను శుభ్రం చేసి చక్కగా అలంకరిస్తారు. వర్తకులకు ఇది ఎంతో మంచి రోజు. ఈ రోజు నుండి కొత్త ఖాతాలు మొదలుపెడతారు. నరకాసుర వధ తో ప్రజలు తమ సంతోషాన్ని బాణ సంచా కాల్చుకుని దీపావళి గా జరుపు కుంటారు. అంతే కాక ఉత్తర భారతం లో ఈ రోజును శ్రీ రాముడు రావణుని పై సాధించిన విజయానికి గుర్తుగా కూడా పండగ చేసుకుంటారు. రావణ వధ తరువాత అయోధ్య వస్తున్నా శ్రీ రామునికి చీకటిని తొలగిస్తూ అందరూ తమ ముంగిట దీపాలతో అలంకరించారట. రావణ వధకు శ్రీ రాముడు ఉత్తర నుంచి దక్షిణానికి వస్తే, నరకాసుర వధకు శ్రీ కృష్ణుడు పశ్చిమ నుండి తూర్పుకు వాచాడు. ఈ విధంగా ఈ ఇద్దరు అవతార పురుషులు దేశం మొత్తాన్ని సమైక్యం చేసారు. ఈ సంవత్సరం నవంబరు 5 దీపావళి వస్తుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions