శ్రీరామనవమి నాడు "శ్రీ సీతారాముల కల్యాణం" భద్రాచలంలో ఘనంగా జరుపుతారు. అంతే కాక ఇంచుమించు ప్రతి రామాలయం లోను ఇతోధికంగా ఈ కార్యక్రమం జరుపుతారు. అయితే సీతారాముల కల్యాణం అనగానే సగటు తెలుగు వారికి, తెలుగు ప్రేక్షకులను ఉత్తేజపరచిన పాట 1961 లో నిర్మించిన "సీతారామ కల్యాణం" లోనిది. ఇది వినిపించని పెళ్లి తెలుగింట ఉండదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మంగళ సూత్రధారణ అవగానే సన్నాయి మేళం వారు వినిపించే ఈ సినిమా పాట ఆ సన్నివేశాన్ని ఎంతో రక్తి కట్టిస్తుంది. ఇది అందరికీ మరువలేని అనుభూతి. ఇంత అద్భుతమైన బాణీ అలనాటి నుండి ఈ నాటి వరకు ఎవర్ గ్రీన్ గా నిలిచిన పాట "సీతారామ కల్యాణం" చిత్రంలో వినిపించే "టైటిల్ సాంగ్". నా చిన్నప్పటి నుండి వింటున్నాను. ఈనాడు కూడా ఈ పాట వింటుంటే ఆ సీతారాముల కల్యాణం కన్నుల ఎదురుగా జరుగుతున్నంత అందమైన, ఆహ్లాదమైన అనుభూతి. ఈ పాట రచయిత, స్వర కర్త, గాయకులూ అందరు ధన్యులే. శ్రీ రామనవమి సందర్భంగా ఈ పాటను గుర్తుచేసుకోవానిపించింది. సీతను పెళ్లి కూతురిని చేసినపుడు మనోహరమైన వర్ణనతో గల ఆరు చరణాల పాట ఇది. దిగువన ఈ పాటను సాహిత్యాన్ని జత చేస్తున్నాను.
చిత్రం: సీతారామ కల్యాణం
రచన: సముద్రాల సీనియర్
సంగీతం: గాలి పెంచలనరసింహారావు
గానం: పి.సుశీల, కోరస్
పల్లవి:
కోరస్: సీతారాముల కళ్యాణము చూతము రారండిశ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
చరణం:
ఆమె: చూచువారలకు చూడ ముచ్చటట పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
కోరస్: చూచువారలకు చూడ ముచ్చటట పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
ఆమె: భక్తి యుక్తులకు ముక్తిప్రదమట
కోరస్: ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
ఆమె: భక్తి యుక్తులకు ముక్తిప్రదమట సురలను మునులను చూడవచ్చురట
కోరస్: కళ్యాణము చూతము రారండి
చరణం:
ఆమె: దుర్జన కోటిని దర్పమడంచగ సజ్జన కోటిని సంరక్షింపగ
కోరస్: దుర్జన కోటిని దర్పమడంచగ సజ్జన కోటిని సంరక్షింపగ
ఆమె: ధారుణి శాంతిని స్థాపన చేయగ
కోరస్: ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
ఆమె: ధారుణి శాంతిని స్థాపన చేయగ నరుడై పుట్టిన పురుషోత్తముని
కోరస్: కళ్యాణము చూతము రారండి
చరణం:
ఆమె: దశరథ రాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ జేసి
కోరస్: దశరథ రాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ జేసి
ఆమె: జనకుని సభలో హరువిల్లు విరచి
కోరస్: ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
ఆమె: జనకుని సభలో హరువిల్లు విరచి జానకి మనసు గెలిచిన రాముని
కోరస్: కళ్యాణము చూతము రారండి - శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
కోరస్: కళ్యాణము చూతము రారండి - శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
చరణం:
ఆమె: విరి కళ్యాణపు బొట్టును బెట్టి
కోరస్: బొట్టును బెట్టి
ఆమె: మణిబాసికమును నుదుటను గట్టి
కోరస్: నుదుటను గట్టి
ఆమె: పారాణిని పాదాలకు బెట్టి
కోరస్: ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
ఆమె: పారాణిని పాదాలకు బెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీతా
కోరస్: కళ్యాణము చూతము రారండి - శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
చరణం:
ఆమె: సంపగి నూనెను కురులను దువ్వి
కోరస్: కురులను దువ్వి
ఆమె: సొంపుగ కస్తూరి నామము తీర్చి
కోరస్: నామము తీర్చి
ఆమె: చెంపగ వాసి చుక్కను బెట్టి
కోరస్: ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
ఆమె: చెంపగ వాసి చుక్కను బెట్టి పెండ్లి కొడుకై వెలసిన రాముని
కోరస్: కళ్యాణము చూతము రారండి - శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
చరణం:
ఆమె: జానకి దోసిట కెంపుల ప్రోవై
కోరస్: కెంపుల ప్రోవై
ఆమె: రాముని దోసిట నీలపు రాశై
కోరస్: నీలపు రాశై
ఆమె: ఆణిముత్యములు తలంబ్రాలుగా
కోరస్: ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
ఆమె: ఆణిముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరసిన సీతారాముల
కోరస్: కళ్యాణము చూతము రారండి - శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి