12, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది మొదలుకొని తొమ్మిది రోజులు వసంత నవరాత్రులుగా పరిగణిస్తారు. చైత్రం ప్రారంభమయిన తొమ్మిదవరోజు నవమే శ్రీరామనవమి. ఇది అవతార పురుషుడు అయిన శ్రీరాముని జన్మదినం. విష్ణువు యొక్క ఏడవ అవతారంగా కౌసల్యా-దశరధులకు చైత్ర శుక్ల నవమి నాడు పునర్వసు నక్షత్రంలో ప్రథమ సంతానంగా శ్రీరాముడు జన్మించాడు. ఆదర్శ తనయుడుగా, ఆదర్శ అగ్రజునిగా, ఆదర్శ శిష్యునిగా, ఆదర్శమైన భర్త గా కీర్తి పొందాడు.  శ్రీ సీతారాములు అందరికీ ఆదర్శ దంపతులు.
  
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం


ప్రతి పదార్ధం:
ఆపదాం = ఆపదలను/బాధలను; అపహర్తారం = పోగొట్టువాడు; దాతారం = ఇచ్చువాడు; సర్వ = అన్ని; సంపదాం = సంపదలను;  లోక = లోకములో; అభిరామ = అందమైన / సుందరమైన ; శ్రీ రామం = శ్రీరాముని; భూయః = మాటికి; భూయః + భూయః = మాటి మాటికి; అహం = నేను; నమామి = నమస్కరిస్తున్నాను.
 

తాత్పర్యం:
ఆపదలను పోగొట్టు వాడు, సర్వ సంపదలను ఇచ్చువాడు, లోకములో అతి సుందరమైన వాడు అయిన శ్రీరామునికి పదే పదే నమస్కరిస్తున్నాను. 


     వాగ్గేయకారులైన అన్నమయ్య, త్యాగరాజు, రామదాసులు తమ రామభక్తిని కృతుల రూపంలో సమర్పించారు.  అలాగే మహా భారతాన్ని తెనుగించిన కవిత్రయంలోని ఒకరైన తిక్కన సోమయాజికి శిష్యుడు, కాకతీయ రుద్రమ దేవికి సామంత రాజు అయిన 13 వ శతాబ్దపు కవి శ్రీ "బద్దెన" (భద్ర భూపాలుడు) అచ్చతెలుగు లో అందరికీ సులువుగా అర్ధం అయ్యే రీతిలో నీతి వాక్యాలను సరళమైన పద్యాల రూపంలో వ్రాసి ముందుగా శ్రీ రాముని స్తుతిస్తూ మొదలు పెట్టి ఒక శతకం వ్రాసాడు. మంచి బుద్ధిని అందరికీ ఒసగే ఈ శతకానికి "సుమతీ శతకము" అని పేరు పెట్టాడు. అందులో ముందుగా శ్రీరాముని తలచుకుని ఇలా అంటాడు బద్దెన..

శ్రీరాముని దయ చేతను 
నారూఢిగ సకల జనులు నౌరాయనగా 
ధారాళమైన నీతులు 
నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతీ! 

తాత్పర్యం: శ్రీ రాముని దయవలన ప్రజలు తప్పక "ఔరా" అని మెచ్చుకునే నీతులు లేదా సూక్తులను నోటిలో నీరు ఊరేటట్లు చెబుతాను.

     అలా శ్రీరాముని దయతో బద్దెన అమోఘమైన పద్యాలను మనకు అందించాడు.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు  

2 కామెంట్‌లు:

Blog Junctions