సూర్యనారాయణ వులిమిరి |
చైత్రం వచ్చింది ని'ఖర'ముగా. ఊరంతా ఉగాది పాడ్యమి నాడు. కాని అమెరికాలో చోద్యం వేరు. సీతామాలక్ష్మి సినిమా లో వేటూరి గారు అన్నట్లు "వీక్ డే ఎడారిలో కోయిల వున్నా ఆ దారిని రాదు వసంతం. పండగైనా, పబ్బమైనా వీకెండే లే". పుట్టినరోజులు, పేరంటాలు కూడా ఎప్పుడు పెడితే అపుడు జరుపుకుంటే పలకరించే నాధుడుండడు. ఆఖరికి ఆపద మొక్కుల వాడికి కూడా వీకెండులోనే పలకరింపులు, చదివింపులు.
ప్రవాసంలో నివాసం అయినా మరువమండీ పండగ సందోహం. అసలే ఎకానమీ ఒక ఎనిమీ అయింది. అందువలన అందరూ ఆచి తూచి అడుగేస్తున్నారు. అయితే ఉగాది అనేసరికి అందరూ అడుగు ముందుకేశారు. మొన్న వీకెండు మా రాలీ (నార్త్ కరోలినా) లో 'ఖర' నామ సంవత్సర ఉగాది సంబరాలు జరుపుకున్నాం, ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (TATA) అధ్వర్యంలో స్థానిక హిందూ భవన్ లో. దాదాపు ఎనిమిది వందల మంది పాల్గొన్నారు - చిన్నా-చితకా, ముసలీ-ముతకా, పిల్లా-జెల్లా, ప్రవాసులు-నివాసులు, విదేశీ సందర్శకులు-స్వదేశీ ప్రదర్శకులు, వింతగా చూసే విదేశీయులు, స్వంత డబ్బా కొట్టుకునే స్వదేశీయులు.. ఒకరేంటి అందరూ పాల్గొన్నారు.
ఉగాది పచ్చడి సేవించడం తో మొదలు పెట్టి, గణేశ ప్రార్థన, తరువాత క్రొత్త నృత్య విద్యార్థుల రంగ ప్రవేశాలు, కోలాటాల కోలాహాలు, పిల్లల కర్నాటక సంగీత మినీ కచేరీలు, రోబో డాన్సుల రోదలోక ప్రక్క, కుర్చీల మధ్య పిల్లల దాగుడు మూతలు ఇంకొక ప్రక్క, మధ్య మధ్య వేదిక పై ఎం.సి. ల అనౌన్సుమెంట్లు, అల్పాహారం అధికంగా తింటున్న అప్పనం మెంబర్లు, చందాలిచ్చి మొహమాటంగా తింటున్న రెగ్యులర్ మెంబర్లు, లంచ్ కి మెనూ సరిగ్గా వచ్చిందో లేదో అని బెంగ పడుతున్న కమిటీ మెంబర్లు, వీటన్నిటి మధ్య మన సంస్కృతిని గుర్తు చేసు కుంటూ చక్కగా ఉగాది సంబరాలు జరుపుకున్నాం. లంచ్ మెనూలో బొబ్బట్లు ప్రత్యేకం. ఈ కార్యక్రమాల సాంపిల్ ను టీవీ-9 వారు ప్రసారం చేసిన "నీ గొట్టం" (you tube) లంకె (link) ను దిగువన చూడండి.
"ఉగాది పచ్చడి సేవించడం తో మొదలు పెట్టి, " -ఉగాది మజా ఉగాది పచ్చడితోనే కదా ప్రారంభమయ్యేది.
రిప్లయితొలగించండి"అల్పాహారం అధికంగా తింటున్న అప్పనం మెంబర్లు, " ఏమి వెరైటీ హాస్యమండి బాబోయ్!
ఒక్క ఉగాది కవితా శ్రవణం తప్ప అంతా సజావుగానే ఉంది. అక్కడి తెలుగు వారిని కలిపిన తాతా వారికి అభినందనలు.