18, ఏప్రిల్ 2011, సోమవారం

మూషికమ్మే మౌస్ రూపమ్ము ధరియించ...ఆడియో లింకు తో

పేరడీలు వ్రాయటం, పాడటం నా హాబీలు. శ్రీ గరికపాటి నరసింహ శాస్త్రి గారు ఒకసారి కంప్యూటర్ మీద ఆశువుగా చెప్పిన పద్యం విని, ఆ స్ఫూర్తి తో ఈ "కంప్యూటర్ దండకం" వ్రాసాను. ఇది కన్నడ రాజ్ కుమార్ నటించిన "కాళహస్తీశ్వర మహాత్మ్యం" చిత్రం కోసం అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారు పాడిన "జయ జయ మహాదేవ శంభో హరా శంకరా" కు పేరడీ. ఈ కంప్యూటర్ దండకాన్ని 2004 ఆటాలో మొదట వినిపించాను. అయితే చాల మంది మిత్రులు దీని ఆడియోను పోస్టు చేయమని అడగడం వలన దీనిని ఆడియో లింకుతో సహా తిరిగి పోస్టు చేస్తున్నాను.

క్రింది ఆడియో లింకును క్లిక్ చేయండి



కంప్యూటర్ దండకం 
జయ జయ మహా యంత్ర రాజా కంప్యూటరా!
డేటా కన్వర్టరా ! చాట్ ప్రోగ్రామరా !
వైరసుల్, బగ్గులు, హేకర్లు నిన్ను బాధించ గలరన్న 
నేనెంత వాడన్ 'విండోధరా'...
సైబరారణ్య మధ్యంబునన్ 
'డాస్' వై పుట్టి 'విండోస్' గా మారగన్ 
పెంటియము వంటి పవరున్న చిప్ ఆకృతిన్
సీడి-డీవీడి రాముండవైనట్టి చక్రాయుధున్ 
మూషికమ్మే మౌస్ రూపమ్ము ధరియించ విఘ్నాకృతిన్! కంప్యూటరున్
హార్డ్ డ్రైవా! కీ బోర్డు స్వభావా !
టవర్, స్పీకర్లు, గిగ హెర్ట్జ్, గిగ బైట్ల ప్రింటర్ సమూహా 
ఇంటర్ నెట్ అన్న జాలంబు, జ్ఞానంబు నీవే కదా !
ఆన్ లైన్ సోదరా, 
జగతి జనమెల్ల ఇ-మెయిల్ తో కలిపేటి 
కాంట్రాక్టరా ! కంప్యూటరా ! ప్రభో ....

పాస్కల్-లోటస్సు-సి -బేసిక్-సి ప్లస్సు-ప్లస్ ప్లస్సు-ఒరకిల్లు జావాల భాషా ధరా  !
డిస్క్-కాంపేక్టు డీవీడి రైటర్ లతో ఒప్పు బరువైన డెస్క్ టాపు కంప్యూటరా !
లైట్ వెయిటున్నలేడీస్ కి సైతమ్ము సులభముగ ఒళ్ళోన అమరేటి లేప్ టాపు కంప్యూటరా!
నీవు పదిలముగ పవళించి అరచేత వైకుంఠమును చూపు పదునైన పాం పైలట్* కంప్యూటరా !
నీకు కోపాగ్ని కలిగించ - బబులేమో పగిలించి - సిలికాన్లో దడ పుట్టి - లే ఆఫ్ కలిగించు డాట్ కాం దామోదరా !
ఐ.టి. దేవా ! నమస్తే ! మెగస్తే ! గిగస్తే కంప్యూటర్ !
__________________________________________________
* ప్రస్తుతం దీన్ని 'పాం పైలట్' నుండి 'ఐ-పాడు' కు గాని 'బ్లాక్ బెర్రీ' కి గాని 'అప్ గ్రేడు' చేసుకోవాలి. 

4 కామెంట్‌లు:

Blog Junctions