18, నవంబర్ 2010, గురువారం

ఆంధ్ర పుణ్య క్షేత్రములపై బాలు-జానకి పాట

 బావ మరదళ్ళు చిత్రం లో 'ముక్కోటి దేవతలు' పాట అందరికీ గుర్తే. అయితే మన రాష్ట్రం లో తిరుపతి మొదలుకొని మా స్వస్థలం శ్రీకాకుళానికి దగ్గర గా ఉన్న అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయం వరకు గల ప్రముఖ పుణ్య క్షేత్రాల మీద బాలు-జానకి పాడిన పాట ఒకటుంది. ఈ పాట కూడా ఇప్పటికీ మరచి పోలేను. అయితే ఈ పాట గురించి ఎంత వెదికినా దొరకలేదు. కాని ఆ పాటలోని పదాలు ఇంచుమించు గుర్తున్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునే రోజుల్లో మాట. మా ఇంట్లో ఈ రికార్డు వుండేది. మళ్ళీ ఎక్కడా వినలేదు. ఆ పాటలోని సాహిత్యం ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఈ పాటలో తిరుపరి, శ్రీ కాళహస్తి, శ్రీశైలం, దాక్షారామం, భద్రాచలం, బెజవాడ, ర్యాలి, యాదగిరి గుట్ట, సింహాచలం, శ్రీ కూర్మం, అరసవిల్లి దేవాలయాలు గురించి వర్ణన వుంది.  రచన ఎవరిదో తెలియదు గాని చాల చక్కని సాహిత్యం.

ఆంధ్ర పుణ్య క్షేత్రములు

    పాడినది: బాలు, ఎస్. జానకి

ప: ఇదే ఆంధ్రభూమి, ఇదే పుణ్యభూమి
    ఇది యోగులకు, భోగులకు జన్మభూమి
    గౌతమీ కృష్ణా తరంగాల పులకించు
    మా తెలుగు సీమలో వెలయు వేలుపులార
    మా ఇలవేల్పులార

చ: తిరుమల శిఖరాన వెలసిన దేవా (2)
    మొరలాలించి లాలించి పాలించరావా
    తిరుమల శిఖరాన వెలసిన దేవా
    దివి నుండి భువికి దిగివచ్చినావే
    స్వర్గముగ తిరుపతిని వెలయించినావే |దివి నుండి|
    కొండెక్కి కూర్చున్న శ్రీవేంకటేశా (
2)
    అడుగుననె పడియున్న బడుగులను కనవా
    ఒక్కొక్క మెట్టె పైకి ఎక్కించరావా
    శ్రీ వేంకటేశా! శ్రీ తిరుమలేశా!

చ: శ్రీకాళహస్తీశ్వరా!
    భూలోక కైలాసవాసా మహేశా
    శ్రీకాళహస్తీశ్వరా!
    సాలె పురుగును, పామునేనుగును
    కన్నప్పను ఏలిన దేవా |సాలె|
    నీ పరీక్షలకు నిలబడలేము
    నీ చరణములే శరణన్నాము
    ఆ..ఆ..ఆ..ఆ.. శ్రీకాళహస్తీశ్వరా!!

చ: శ్రీశైల మల్లేశ్వరా!
    భ్రమరాంబికాసతీ హృదయేశ్వరా
    శ్రీశైల మల్లేశ్వరా!
    పార్థునికి పాశుపతమందించినావే
    మాకు నీ చేయూత నందించవేమి |పార్థునికి|
    మనసులో మల్లియలు విరబూయు స్వామి (
2)
    మాబ్రతుకు పూబాటగా మలచవేమి
    శ్రీశైల మల్లీశ్వరా!
 

చ: బెజవాడ కనకదుర్గమ్మా!
    విశ్వమోహనముగా వెలసినావమ్మా
    బెజవాడ కనకదుర్గమ్మా!
    తెలుగు హృదయాలు నీ పూజా సుమాలు
    చల్లగా మము చూడవమ్మా! అదే చాలు 
    మనసార చల్లగా మము చూడవమ్మా
    బెజవాడ కనక దుర్గమ్మా!
 
చ: అంగీకృతాభంగ గంగాతరంగా
    ఓ కోమలాంగా శ్రీభీమలింగా |అంభీ|
    నీవెట నుండిన అదె కైలాసం
    దక్షిణ కాశీ దాక్షారామం |నీవెట|
    తెలుంగు సీమకు వెలుంగొసంగిన
    దాక్షారామమె భూకైలాసం
    ఈ దాక్షారామమె భూకైలాసం |ఈ దాక్షా|
 


చ: చిరునవ్వు వెన్నెలల చెలువములు పండించి
    ర్యాలి లో రాళ్ళలో పూలు పూచిన స్వామి
    కోనసీమా వాస శ్రీజగన్మోహనా
    జోహారు! జోహారు! జోహారు! స్వామి
    శ్రీజగన్మోహనా జోహారు స్వామి
 

 చ: త్యాగమయా! అనురాగమయా!
    భద్రాద్రినిలయా రామయ్యా!
    త్యాగమయా! అనురాగమయా!
    అయోధ్య విడి మా అమ్మ సీతతో
    ఆంధ్రావనికీ అరుదెంచితివా |అయోధ్య|
    నరుడుగ పుడితే దేవుడె అయినా
    నానా బాధలు పడవలెనా?..
    రామదాసు నలనాడు కష్టముల నాదుకున్న ఓ రామయ్యా
    చీకటిలో తారాడు మాకిపుడు వెలుగుదారులను చూపవయా
    త్యాగమయా! అనురాగమయా!


చ: శ్రీ సత్య నారాయణా! జయ శ్రీ ఆదినారాయణా!
      శ్రీ భూదేవుల సేవలందుచూ
     అన్నవరము లో వెలసిన దేవా 
     ఆపద మొక్కుల వాడవయా
     మా ప్రాపై నిలచిన బంగారు కొండా!
     కనుగొనవయ్య నీ వారము మము
     కన్నుల వెన్నెల నిండా
     శ్రీ సత్య నారాయణ! హే శ్రీ ఆది నారాయణా!


చ: యాదగిరిని, సింహాచలమందున
    వెలసిన లక్ష్మీ నరసింహా!
    ప్రహ్లాదుడు పిలువగనె కంటబడి
    వరములొసంగిన దయామయా
    ఎదలో నిలిచి ఎంత పిలిచినా |ఎదలో|
    ఎందుకు పలుకవు దయలేదా
    నరసింహా! దయలేదా!


చ: అనంత భూభారము వహియింపగ
    శ్రీకూర్మములో వెలసిన దేవా |అనంత|
    చేకొను ఇవె మా నుతులు, నతులు |చేకొను|
    శ్రీనాథా! భూనాథా! శ్రీకూర్మ నాథా!

చ: జగదేకపావన సూర్యనారాయణ
    ప్రత్యక్ష దైవమా ఓ లోకబంధూ! |జగదేక|
    భక్తజన హృదయాలు పద్మమ్ములై విరియ
    అరసవిల్లిని నీవు వెలసినావా |భక్తజన|
    అంజలింతుము దేవ మమ్మేలుకోవ
    జగదేకపావన సూర్యనారాయణ
    సూర్యనారాయణ! సూర్యనారాయణ!
    సూర్యనారాయణ! సూర్యనారాయణ!


కొస మెరుపు: ఈ పాట పోస్టు చేసిన కొద్ది నిముషాలలోనే పాట, రచన దొరికింది. దిగువన గల లింకు లో విని ఆనందించండి.
రచన: స్వర్గీయ శ్రీ వక్కలంక లక్ష్మీపతి రావు గారు 
స్వర కల్పన: స్వర్గీయ సాలూరి హనుమంత రావు గారు  
http://sirakadambam.blogspot.com/2010/08/blog-post_08.html

3 కామెంట్‌లు:

  1. ఇక్కడ చూడండి : శిరాకదంబం
    http://sirakadambam.blogspot.com/2010/08/blog-post_08.html

    రిప్లయితొలగించండి
  2. వెదక బోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. అంతా అంతర్జాల మహిమ. చాల చాల ధన్యవాదాలు. మీ లింకును ఇప్పుడే నా బ్లాగులో పోస్టు చేస్తాను.

    రిప్లయితొలగించండి
  3. * సూరి గారూ !
    చాలాకాలంనాటి ఈ పాట గుర్తుపెట్టుకున్నందుకు, మీ బ్లాగులో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ రకంగానైనా మళ్ళీ మా గురువుగారి పాట మరోసారి ప్రాచుర్యం పొందుతున్నందుకు ఆనందంగా వుంది. ఆయన ఆత్మకు తప్పక శాంతి కలుగుతుంది.
    * మనవాణి గారూ !
    గుర్తుపెట్టుకుని లింక్ ఇచ్చిన మీకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

Blog Junctions