ప్రముఖులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రముఖులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, అక్టోబర్ 2011, ఆదివారం

గాంధీ పై భావోద్వేగమైన సిరివెన్నెల గీతం - గుండె లోనుండి గొంతు లోకి


మహాత్మా గాంధి

రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారామ్
ఈశ్వర అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్


సిరివెన్నెల గారి కలానికి ఒక రసం మాత్రమె అన్న హద్దు లేదు. భక్తీ గీతాలు, శాస్త్రీయ సంగీతానికి అనువైన విలక్షణ గీతాలు,  ప్రేమ గీతాలు, విరహ గీతాలు, దేశ భక్తి గీతాలు, విప్లవ గీతాలు, ఒకటేమిటి ఏ కోణంలో చూసినా ఆయన ఒక్కో రూపాన్ని చూపిస్తారు మనకు. మహాత్మా గాంధీ పై 'మహాత్మా' చిత్రం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వ్రాసిన ఈ పాట తెలుగు హృదయాలలో కలలాలం నిలిచిపోయే పాట - ఆయన గుండెలోంచి సగటు భారతీయుని హృదయ ప్రతిధ్వని గా..




 బాలు గళంలో 'మహాత్మా' చిత్రం' నుండి. అయితే సెన్సార్ కత్తెర ప్రభావం పాటలో ప్రస్ఫుటిస్తుంది. ఇందులో కొంప ములిగిపోయే అంత అభ్యంతరం ఏమిటో? ఇందిరమ్మను తొలగించి 'కొంతమంది' అని మార్చినట్లున్నారు. ఇదీ మనకుండే స్వేచ్చ.  ఈ పాట చిత్రీకరణ చాల బాగా చేసారు ఈ చిత్రంలో. ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కంట నీరు పెట్టిస్తుండీ చరమాంకం.


చిత్రం: మహాత్మ (2009)
రచన: సిరివెన్నెల 
గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం 
సంగీతం: విజయ్ ఎంతోనీ 

సాకీ:  రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారామ్
        ఈశ్వర అల్లా తెరో నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్

చ:     కొంతమంది (ఇందిరమ్మ) ఇంటి పేరు కాదుర గాంధి
        ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి (2)
        కరన్సీ నోటు మీద, ఇలా నడి రోడ్డు మీద
        మనం చూస్థున్న బొమ్మ కాదుర గాంధి
        భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధి
        తర తరాల యమ యాతన తీర్చిన వరదాతరా గాంధి
        ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధి
        ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి

చ:     రామ నామమే తలపంతా, ప్రేమ ధామమే మనసంతా
        ఆ శ్రమ దీక్షా స్వతంత్ర కాంక్షా
        ఆకృతి దాల్చిన అవదూత, అపురూపం ఆ చరిత
        కర్మ యోగమే జన్మంతా, ధర్మ క్షెత్రమే బ్రతుకంతా
        సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత
        ఈ బోసి నోటి తాతా
        మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధి
        మహత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి
        సత్యాహింసల మార్గ (స్వర్ణ) జ్యోతి, నవ శకానికే నాంది
        ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధి
        ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి 

చ:     గుప్పెడు ఉప్పును పోగేసి, నిప్పుల ఉప్పెనగా చేసి
        దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత
        సిసలైన జగజ్జేత  ...
        చరఖా యంత్రం చూపించి, స్వదేశి సూత్రం నేర్పించి
        నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత
        సంకల్ప బలం చేత..
        సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన కాంతి
        తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేఛ్చా భానుడి ప్రభాత కాంతి
        పదవులు కోరని పావన మూర్తి, హృదయాలేలిన చక్రవర్తి
        ఇలాంతి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
        నమ్మరానిదని నమ్మకముండే ముందు తరాలకి చెప్పండి
        సర్వ జన హితం నా మతం

        అంటరాని తనాన్ని అంతః కలహాలన్ని అంతం చేసేందుకే
        నా ఆయువంతా అంకితం, హే రామ్ 

మహాత్మునికి అశ్రు నివాళులతో
జై హింద్!

5, సెప్టెంబర్ 2011, సోమవారం

ఓనమాలు దిద్దించిన ఒజ్జకు ప్రణామములు

డా. సర్వేపల్లి రాధా కృష్ణన్
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మనకు విద్యనొసగిన గురువుకు మనం ఎంతో ఋణపడి ఉన్నాం. అందుకే  "మాతృ దేవో భవ! పితృ దేవో భవ! ఆచార్య దేవో దేవో భవ!" అన్నారు.  ఒక విధంగా ప్రతి వ్యక్తికీ తల్లి తొలి గురువు, తరువాత తండ్రి. అయితే మనకు చదువు చెప్పి, సంస్కారాన్ని నేర్పిన గురువు మన జీవితంలో చాల ప్రముఖ పాత్ర వహిస్తాడు / వహిస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మలా జ్ఞాన బీజాలు నాటి మనలో సృజనాత్మకు నారు పోసి, స్థితికారుడైన విష్ణువులా మనలో మొలకెత్తిన జ్ఞానమనే అంకురాలను శ్రద్ధాసక్తులనే నీరు పోసి పెంపుజేసి, లయకారుడైన శివునిలా విద్యా వృక్షానికి పట్టిన అజ్ఞానమనే చీడను నాశనము చేసి సంస్కరించినందుకు అతనిని / ఆమెను గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుదేవో మహేశ్వరః అంటూ, సాక్షాత్తు పరబ్రహ్మ అయిన ఆ గురువుకు నమస్కరిస్తాము.  అటువంటి గురువులను పూజించవలసిన ఈ రోజు ఉపాధ్యాయుల లేదా అధ్యాపకుల రోజు (Teachers Day).

     ఉపాధ్యాయుల రోజు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు (1988-1975). ఈయన పేరు చూస్తె "తెలుగు వారా? తమిళులా?" అన్న సందేహం కలుగుతుంది కదా. నిజమే, దానికి కారణం లేక పోలేదు. వీరు తమిళ దేశంలో పుట్టిన తెలుగువారు.  రాధా కృష్ణన్ గారు మదరాసుకు దగ్గర తిరుత్తణిలో సెప్టెంబరు 5 న, అంటే ఈ రోజే ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.  ఆర్ధిక పరిస్థితుల కారణంగా, తన నిర్ణయం తో ప్రమేయం లేకుండా, తన కజిన్ ఇచ్చిన సెకండ్ హేండు ఫిలాసఫీ పస్తకాలు ఆయన భవిష్యత్తును నిర్ణయించాయి. అందువలన ఆయన ఫిలాసఫీ లో పట్టా తీసుకున్నారు. అయితే ఫిలాసఫీ సబ్జక్టు ఆయనను ఎంతో ఉత్తేజితులను చేసింది. ప్రాక్-పశ్చిమాల ఫిలాసఫీ మీద ఎన్నో వ్యాసాలూ, వ్యాఖ్యానాలు, భాష్యాలు వ్రాసారు. మచిలీపట్నం జాతీయ కళాశాలలో కొంత కాలం అధ్యాపకునిగా పని చేశారు. బోధకునిగా, అధ్యాపకునిగా, వైస్ ఛాన్సలర్ గా (ఆంధ్రా మరియు మైసూర్ యూనివర్సిటి), భారత దేశానికి ప్రథమ ఉప రాష్ట్రపతి గా (1952-62), ద్వితీయ రాష్ట్రపతి గా (1962-67) ఆయన ఎదగని ఎత్తులు లేవు, వారిలోని అధ్యాపకునికి నిర్ణయించవలసిన ఎల్లలు లేవు. వీరికి గల పురస్కారాలు 'నైట్ హుడ్' (కింగ్ జార్జ్ V చే), 'భారత రత్న', మరియు 'ఆర్డర్ ఆఫ్ మెరిట్'.  

     శ్రీ రాధా కృష్ణన్ గారు రాష్ట్రపతి గా ఎన్నికైనపుడు ఆయన శిష్యులు, స్నేహితులు ఆయన జన్మదినాన్ని ప్రతి ఏటా జరుపు కోవడానికి అనుమతించమని ఆయనను అడిగారట. అప్పుడాయన, "నా పుట్టిన రోజుగా కాదు, దీనిని ఉపాధ్యాయుల దినోత్సవం గా జరుపుకోవడం నాకు సంతోషము, గర్వ కారణము" అని అన్నారట. అప్పటి నుండీ, సెప్టెంబరు 5 వ తేదీని "అధ్యాపకుల దినోత్సవము" లేక" టీచర్స్ డే" గా మనము జరుపు కుంటున్నాము.

     "విద్య లేనివాడు వింత పశువు" అన్నారు. అందువలన మనకు ఓనమాలు దిద్దించి, చదువు నేర్పించి, మనలను సంస్కారవంతులైన మనుషులుగా తీర్చి దిద్దిన గురువులను గుర్తించడం, వారిని స్మరించడం, సేవచేయడం మన కర్తవ్యం. వారికి మనమెంతో ఋణపడి ఉన్నాం. మనం ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటుంటాం. ఇది జీవితమంతా కొనసాగుతుంటుంది. అందువలన మనం నిరంతర జ్ఞానాన్వేషులం. బ్రతికినంత కాలం విద్యార్థులం. 

సాటి విద్యార్థులు అందరికీ "అధ్యాపక దినోత్సవ శుభాకాంక్షలు".
అస్మద్ గురుభ్యోన్నమః

13, జనవరి 2011, గురువారం

ఈ రోజే స్వామి వివేకానంద జయంతి.

(1863-1902)
యావత్ భారత జాతి గర్వించ దగ్గ మహా మనీషి శ్రీ స్వామి వివేకానంద.  ఈ రోజే (జనవరి 12) ఆ మహాత్ముని జయంతి.  అద్భుతమైన జ్ఞాపక శక్తి గల వేదాంత జిజ్ఞాసి, పరమత సహన పిపాసియైన ఈ వంగ నందనుడు శ్రీ రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. గురు శుశ్రూష లో అద్వైత వేదాంతాన్ని నేర్చి, మానవ సేవయే మాధవ సేవయని గ్రహించాడు. సంచరించే సన్యాసియై జన జీవన స్రవంతిలో కలసి దేశ స్థితి గతులను తెలుసుకొన్నాడు.  శ్రీ వివేకానందుడు తన వాక్పటిమతో 1893 లో అమెరికా లోని చికాగో నగరంలో విశ్వ వేదిక పై సర్వమతసమాఖ్య (Parliament of Rligions) లో "అమెరికను సోదర సోదరీమణులారా" అని సంబోధిస్తూ తన ఉపన్యాసం లో హిందూ మతం యొక్క స్థాయిని ప్రపంచ మతాలకు సరిగా సూచించి భారత జాతికి ఎనలేని ఔన్నత్యం తెచ్చి పెట్టాడు.  అచిరకాలం జీవించినా భారతావనికి అంతులేని జ్ఞాన సంపదను ఇచ్చి, వేదాంత ప్రాభవాన్ని కలిగించాడు.          

శ్రీ వివేకానందుని కొన్ని హితవచానాలు ఈ దిగువన చూడగలరు.

  • "ఆత్మకు అసాధ్యమైనది ఏదైనా ఉందని ఎన్నడూ అనుకోవద్దు. అది ఒక పెద్ద అపోహ". 
  • "మనము గాని, ఇతరులు గాని బలహీనులని చెప్పడం అంత పాపం ఇంకొకటి లేదు". 
  • "మన గురించి మన ఆలోచనలే చెప్తాయి. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నామో అన్నది చాల ముఖ్యం". 
  • మాటలు ప్రత్యామ్నాయాలు మాత్రమే, కాని ఆలోచనలు శాశ్వతమైనవి. అవి చాల దూరం ప్రయాణిస్తాయి".
  • "నిన్ను నీవు నమ్మనంత వరకు దేవుడ్ని నమ్మలేవు".
  • "ఈ ప్రపంచం ఒక పెద్ద వ్యాయామ శాల. మనలను బలవంతులను చేసుకోవడం కోసం ఇక్కడకు వస్తాం". 
  • "నీ హృదయం లోను, ప్రతి జీవిలోనూ గల దేవుడ్ని చూడలేని నీవు ఎక్కడికి వెళ్లినా దేవుని చూడలేవు".
  • "లెమ్ము. మేల్కొనుము. నీ గమ్యం చేరే వరకు ఆగకుము".
  • "ప్రపంచం లోని శక్తి అంతా మన వద్దనే వుంది. కానీ మనమే మన కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని లోకమంతా చీకటిగా వుందని విలపిస్తున్నాం". 
  • "మన బలమే మన జీవితం. మన బలహీనతే మన మృత్యువు".
  • "నీపై నీకు నమ్మకం ఉంచు. నీ అభిమతానికి నిజంగా కట్టుబడి ఉండటమే నిజమైన మతం".
  • "మీకు తెలుసా! నేను మళ్ళీ పుట్టాలేమో! ఎందుకంటే, నేను మానవాళి ప్రేమలో పడ్డాను". 
  • "ప్రతి ఒక్కరినీ వారి అత్యంత ఉన్నతమైన ఆశయ సాధనలో ప్రోత్సహించడం మన ధర్మం. అంతేకాక దానిని సత్యానికి దగ్గరగా తోడ్కొని పోవడంలో మనం సహకరించాలి". 
  • "విషయ వాసనలకు చలించని వాడే, అమరత్వాన్ని సాధించిన వాడు".
  • "నీ జీవితాన్ని అందరి మంచి కోసం, అందరి సుఖం కోసం వెచ్చించడమే నిజమైన మతం. నీ కోసం నీవు చేసుకునేది మతం కాదు".
  • "ఒక ఆలోచన మనసును ఆవరించినపుడు అది భౌతిక లేకా మానసిక స్థితి లోకి రూపాంతరం చెందుతుంది". 
      మనకు ఎందఱో ప్రవక్తలు, ప్రభోతలు ఎన్నో మంచి మార్గాలను చూపించారు. నిజంగా భారతీయులు ఎంత అదృష్టవంతులు. కాని మనం ఎంత వరకు వీరి బోధలను ఆచరిస్తున్నాము.  అంతా గొప్పలు చెప్పుకోవడానికే, గాని ఆచరణలో చాల వెనుకబడి ఉన్నాం. ఒకప్పుడు అనే వాళ్ళం "ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి సమస్తం పర పీడన పరాయణత్వం".  ఇక్కడ పరులు కాదు మనను మనమే పీడించు కుంటున్నాము. అర్థం లేని విద్వేషాలు, అంతర్గత కలహాలు, అసూయా ద్వేషాలు మొదలయినవి మనకు నిత్య వ్యాపకాలు అయిపోయినాయి.  ఈ మత్తులో నుండి బయటపడితే గాని ఏ అభివృద్ధిని సాధించలేము. 
అమరుడైన ప్రవక్త శ్రీ వివేకానందునికి నివాళులు అర్పిస్తూ..

Blog Junctions