5, సెప్టెంబర్ 2011, సోమవారం

ఓనమాలు దిద్దించిన ఒజ్జకు ప్రణామములు

డా. సర్వేపల్లి రాధా కృష్ణన్
నకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మనకు విద్యనొసగిన గురువుకు మనం ఎంతో ఋణపడి ఉన్నాం. అందుకే  "మాతృ దేవో భవ! పితృ దేవో భవ! ఆచార్య దేవో దేవో భవ!" అన్నారు.  ఒక విధంగా ప్రతి వ్యక్తికీ తల్లి తొలి గురువు, తరువాత తండ్రి. అయితే మనకు చదువు చెప్పి, సంస్కారాన్ని నేర్పిన గురువు మన జీవితంలో చాల ప్రముఖ పాత్ర వహిస్తాడు / వహిస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మలా జ్ఞాన బీజాలు నాటి మనలో సృజనాత్మకు నారు పోసి, స్థితికారుడైన విష్ణువులా మనలో మొలకెత్తిన జ్ఞానమనే అంకురాలను శ్రద్ధాసక్తులనే నీరు పోసి పెంపుజేసి, లయకారుడైన శివునిలా విద్యా వృక్షానికి పట్టిన అజ్ఞానమనే చీడను నాశనము చేసి సంస్కరించినందుకు అతనిని / ఆమెను గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుదేవో మహేశ్వరః అంటూ, సాక్షాత్తు పరబ్రహ్మ అయిన ఆ గురువుకు నమస్కరిస్తాము.  అటువంటి గురువులను పూజించవలసిన ఈ రోజు ఉపాధ్యాయుల లేదా అధ్యాపకుల రోజు (Teachers Day).

     ఉపాధ్యాయుల రోజు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు (1988-1975). ఈయన పేరు చూస్తె "తెలుగు వారా? తమిళులా?" అన్న సందేహం కలుగుతుంది కదా. నిజమే, దానికి కారణం లేక పోలేదు. వీరు తమిళ దేశంలో పుట్టిన తెలుగువారు.  రాధా కృష్ణన్ గారు మదరాసుకు దగ్గర తిరుత్తణిలో సెప్టెంబరు 5 న, అంటే ఈ రోజే ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.  ఆర్ధిక పరిస్థితుల కారణంగా, తన నిర్ణయం తో ప్రమేయం లేకుండా, తన కజిన్ ఇచ్చిన సెకండ్ హేండు ఫిలాసఫీ పస్తకాలు ఆయన భవిష్యత్తును నిర్ణయించాయి. అందువలన ఆయన ఫిలాసఫీ లో పట్టా తీసుకున్నారు. అయితే ఫిలాసఫీ సబ్జక్టు ఆయనను ఎంతో ఉత్తేజితులను చేసింది. ప్రాక్-పశ్చిమాల ఫిలాసఫీ మీద ఎన్నో వ్యాసాలూ, వ్యాఖ్యానాలు, భాష్యాలు వ్రాసారు. మచిలీపట్నం జాతీయ కళాశాలలో కొంత కాలం అధ్యాపకునిగా పని చేశారు. బోధకునిగా, అధ్యాపకునిగా, వైస్ ఛాన్సలర్ గా (ఆంధ్రా మరియు మైసూర్ యూనివర్సిటి), భారత దేశానికి ప్రథమ ఉప రాష్ట్రపతి గా (1952-62), ద్వితీయ రాష్ట్రపతి గా (1962-67) ఆయన ఎదగని ఎత్తులు లేవు, వారిలోని అధ్యాపకునికి నిర్ణయించవలసిన ఎల్లలు లేవు. వీరికి గల పురస్కారాలు 'నైట్ హుడ్' (కింగ్ జార్జ్ V చే), 'భారత రత్న', మరియు 'ఆర్డర్ ఆఫ్ మెరిట్'.  

     శ్రీ రాధా కృష్ణన్ గారు రాష్ట్రపతి గా ఎన్నికైనపుడు ఆయన శిష్యులు, స్నేహితులు ఆయన జన్మదినాన్ని ప్రతి ఏటా జరుపు కోవడానికి అనుమతించమని ఆయనను అడిగారట. అప్పుడాయన, "నా పుట్టిన రోజుగా కాదు, దీనిని ఉపాధ్యాయుల దినోత్సవం గా జరుపుకోవడం నాకు సంతోషము, గర్వ కారణము" అని అన్నారట. అప్పటి నుండీ, సెప్టెంబరు 5 వ తేదీని "అధ్యాపకుల దినోత్సవము" లేక" టీచర్స్ డే" గా మనము జరుపు కుంటున్నాము.

     "విద్య లేనివాడు వింత పశువు" అన్నారు. అందువలన మనకు ఓనమాలు దిద్దించి, చదువు నేర్పించి, మనలను సంస్కారవంతులైన మనుషులుగా తీర్చి దిద్దిన గురువులను గుర్తించడం, వారిని స్మరించడం, సేవచేయడం మన కర్తవ్యం. వారికి మనమెంతో ఋణపడి ఉన్నాం. మనం ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటుంటాం. ఇది జీవితమంతా కొనసాగుతుంటుంది. అందువలన మనం నిరంతర జ్ఞానాన్వేషులం. బ్రతికినంత కాలం విద్యార్థులం. 

సాటి విద్యార్థులు అందరికీ "అధ్యాపక దినోత్సవ శుభాకాంక్షలు".
అస్మద్ గురుభ్యోన్నమః

3 కామెంట్‌లు:

  1. మురళి అహోబిల గారు, నమస్కారం. చాల చక్కగా సూచించారు అచ్చుతప్పును. అది సవరించాను.

    రిప్లయితొలగించండి
  2. సూర్యనారాయణ గారూ !
    రాధాకృష్ణన్ గారి గురించి చక్కగా వివరించారు. ఇంకొక చిన్న విషయం. ఆయన కొద్దికాలమే అయినా మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో అథ్యాపకునిగా పనిచేశారు.

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు రావు గారు. మీరు సూచించిన చారిత్రిక విషయాన్ని నా వ్యాసంలో చేర్చాను. మంచి విషయం చెప్పారు.

    రిప్లయితొలగించండి

Blog Junctions