28, జులై 2011, గురువారం

పురుషులకు అలంకారమిచ్చేది ఏది?

భర్తృహరి పేరు వినని వారుండరు. ముఖ్యంగా భర్తృహరి సుభాషితములు చాల ప్రసిద్ధి పొందినవి. ఇంతకూ భర్తృహరి ఎవరు? భర్తృహరి ఉజ్జయినికి రాజైన విక్రమాదిత్యునికి సవతి అన్నగారు. యితడు రాజ్యమును వదలి విరాగియై మూడు శతకాలను రచించాడు. అవి నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము. అందులోని సుప్రసిద్ధమైన ఈ శ్లోకం పురుషులకు ఉండవలసిన లక్షణాల గురించి చెబుతుంది. అయితే ఇక్కడ పురుషులు అంటే మగవారు అని కాదు.  పురుషులు అంటే వ్యక్తులు.  "మన దేహం ఒక పురం అనుకుంటే అందులోని జీవుడు పురుషుడు" అని భగవద్గీత లో భగవానుడైన శ్రీ కృష్ణుడు ఉటంకించాడు.  కొన్ని దశాబ్దాల క్రితం ఆకాశవాణి లో సంస్కృత పాఠం వచ్చే ముందు వినిపించేవారు ఈ శ్లోకాన్ని.
 
కేయురాని న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వల 
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా 
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 
క్షీయంతే ఖలు భూషణాని సతతం  వాగ్భూషణం భూషణం 

ప్రతి పదార్థము: కేయూరం = భుజకీర్తి / భుజబంధనం (armlet); = లేక; భూషయంతి = అలంకారం; పురుషం = పురుషులకు / వ్యక్తులకు; హారా = హారం / దండ; చంద్రోజ్జ్వాల = చంద్ర = చంద్రుని వలె; ఉజ్జ్వల = ప్రకాశవంతమైన; స్నానం = స్నానము; విలేపనం = పూత; కుసుమం = పువ్వు; యా = లేక; అలంకృతా = అలంకారం; మూర్ధ = తల; = పుట్టినవి; మూర్ధజ = జుట్టు;  వాణి = మాట / పలుకు; ఏకా = ఒకే ఒక / ఒక్క; సమలం = మలినము; కరోతి = అగును; సతతం = ఎల్లప్పుడూ; యా = ఏదైతే; సంస్కృతీ = సంస్కారము; ధార్యతే = ధరించిన / ఒప్పిన; క్షీయంతే = క్షీణించు / నశించు; ఖలు = ఎల్లప్పుడూ;  భూషణం = అలంకారం/ఆభరణం; వాక్ = పలుకు / మాట.

పురుషులకు (వ్యక్తులకు) అలంకారమును లేక శోభ నిచ్చేవి భుజ బంధనములు, చంద్రుని వలె ప్రకాశించు హారములు, పరిశుద్ధుని చేసే స్నానములు, సుగంధపు పూతలు, పువ్వులు, తలపై నుండు కేశ సంపద కావు. ఇటువంటి అలంకారాలు ఎప్పటికైనా మలినమవుతాయి. కాని ఎల్లప్పుడూ సంస్కారవంతమును ఇచ్చే పలుకు/మాట, అది ఒక్కటైనా చాలు అదే వారికి మంచి ఆభరణం. 

ఏనుగు లక్ష్మణకవి తెలుగు పద్యం అదే అర్థంతో--
భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు,పురుషుని భూషితు జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియుంచు నన్నియున్


Thanks to the ajnata comment. 

4 కామెంట్‌లు:

  1. గతం లో మంచి సోపు తో స్నానం, ఆనక ఆఫ్టర్ బాత్ జెల్, డియో, బాడీ స్ప్రే, బ్రాండెడ్ బట్టలు, బూట్లు, ఇంకా అనేక గేడ్జెట్లు మాత్రమే అలంకారం అనుకునే వాళ్ళలో నేనూ ఒకడిని,
    మంచి శ్లోకం ప్రతిపదార్ధం చెప్పి కనువిప్పి కలిగించారు. పాత రోజుల్లో రేడియో లో వచ్చిన ఆ శ్లోకం ఈ మధ్య కాలంలో చాలా ఏళ్ళు నా రింగ్ టోన్ గా ఉంది.
    మంచి టపా, అభినందనలు !!

    రిప్లయితొలగించండి
  2. ఆత్రేయ గారు, ధన్యవాదాలు. మీరు చెప్పిన లేటెస్ట్ లిస్ట్ బాగుంది. చాల బాగా చమత్కరించారు.

    రిప్లయితొలగించండి
  3. ఆత్రేయ గారికి, నమస్కారములు. ఆ పదానికి నాకు సరియైన అర్థం దొరకలేదు. ఆలంకృతాం + ఊర్ధజా అని సంధి వున్నదేమోనని కొంత ఊహించాను. అయితే విజ్ఞులైన బ్రహ్మశ్రీ మీ బాబాయ్ గారు ఆ సందేహాన్ని నివృత్తి చేశారు. వారికి నా ప్రణామములు, ధన్యవాదములు తెలియజేయగలరు. వారి సూచన ప్రకారం నా టపాలో మార్పు చేసాను.

    రిప్లయితొలగించండి
  4. The exact Telugu poem written for this by Yenugu Laxmana Kavi reads as under:

    Bhooshalu Gaavu Marthyulaku,Bhoori Mayaangada Thaara Haaramul,
    Bhooshitha Keasha Paasha Mrudu Pushpha Sugandha Jalaabhishekamul,
    Bhooshalu Gaavu MaanujuniBhooshithu Jeayu Pavithra Vaani,
    Vagbhooshanamea Subhooshanamu Bhooshanamul Nashiyinchu Nanniyun!!!

    రిప్లయితొలగించండి

Blog Junctions