మాఘ మాసం శుక్ల పక్షం లో సూర్యుని ఉత్తరాయణ ప్రవేశం జరిగిన ఏడవ రోజు (సప్తమి) సూర్య జయంతి. ఇదే రథ సప్తమి (ఫిబ్రవరి 10, 2011). ఈ రోజు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంలో గగన వీధిన పయనిస్తాడు. ఏడు గుర్రాలు ఇంద్ర ధనుస్సు లోని ఏడు రంగులకు, వారం లోని ఏడు రోజులకు ప్రతీకలు. సూర్యుని రథ సారథి అరుణుడు. సూర్యోదయానికి ముందు వచ్చే అరుణకాంతి భానుని ఆగమనానినికి గుర్తు. అరుణుడు కశ్యప మహర్షి-వినత ల పుత్రుడు. తల్లి తొందరపాటు వలన అర్ధదేహం తో జన్మించాడు. ఊరువులు (తొడలు) లేనివాడు గనుక అరుణుడిని 'అనూరుడు' అని కూడా అంటారు.
సూర్యుని రాకను తెలిపే ఈ శ్లోకం "లవకుశ" చిత్రం లోని ఈ శ్లోకాన్ని అమర గాయకుడు శ్రీ ఘంటసాల గళం లో వినండి.
సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
తాత్పర్యం: ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించిన, మిక్కిలి తేజోవంతుడు, కశ్యప మహాముని పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించిన సూర్య దేవా నీకు నేను నమస్కరిస్తున్నాను.
 |
శ్రీ సూర్యనారాయణస్వామి |
ప్రత్యక్షదేవుడు అయిన సూర్యుడు కశ్యప మహర్షి-అదితి ల పుత్రుడు. అందువలన ఆదిత్యుడు అని కశ్యపాత్మజుడు లేదా కాశ్యపేయం అని అంటారు. తెలుగు వారికి చిరపరిచితమైన ప్రముఖ సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా లో శ్రీకాకుళం పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో గల "అరసవిల్లి". ఇక్కడ శ్రీ సూర్య నారాయణ మూర్తి ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా వెలిశాడు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు "రామలింగ స్వామి" గా వెలసిన పరమ శివుడు. ఈ క్షేత్ర వర్ణన ఈ శ్లోకంలో చూడండి.
హర్షవల్లీ పురీవాసం చాయోషా పద్మినీయుతం
సూర్యనారాయణ దేవం నౌమి సర్వార్థదాయకం
ఒకప్పటి "హర్షవల్లి" ఈ నాడు "అరసవిల్లి" గా పిలువబడుతున్నది. రథ సప్తమి నాడు జిల్లేడు ఆకు, రేగు పండు తలపై పెట్టుకుని ఉదయాన్నే స్నానం చేస్తారు. చిక్కుడు కాయలతో రథాలు చేసి, పరవాణ్ణం వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్య భగవానునికి నివేదిస్తారు. ఈ అరసవిల్లి దేవాలయం విశిష్టత ఏమిటంటే ఆలయ నిర్మాణం జరిగిన తీరు అపూర్వం. ఎందుకంటే ప్రతి ఏడాది కేవలం ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు మాత్రం ప్రభాత సూర్యుని తొలి కిరణాలు ఆలయ గోపురం నుండి ధ్వజ స్థంభం మీదుగా వచ్చి నేరుగా స్వామివారి పాదాలను తాకుతాయి. వేరే రోజులలో ఇటువంటి ఘటన జరగదు. ఈ వింత చూడటానికి భక్తులు తండోపతండాలుగా అరసవిల్లి దేవాలయాన్ని ప్రాతః కాలమే దర్శిస్తారు. సూర్య నారాయణ స్వామి వారికి భక్తులు 'వెండి కన్ను', 'బంగారు కన్ను' సమర్పిస్తారు. అలా చేస్తే చర్మ మరియు నేత్ర సంబంధమైన జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుతారని నమ్మకం. అరసవిల్లి దేవాలయం గోడలపై అగస్త్య మహర్షి శ్రీ రామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం మరియు గ్రహస్తుతిని తెలిపే నవగ్రహ స్తోత్రం భక్తులకు అనువుగా వ్రాయబడ్డాయి. నవగ్రహ స్తోత్రం లో కూడా సూర్య దేవుని వర్ణన వుంది.
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
రథ సప్తమి మొదలుకుని సగటు ఉష్ణోగ్రత రోజు రోజుకూ పెరుగుతూ వసంత ఋతువుకు దారి తీసి మనకు మరో యుగాది నిస్తుంది.
నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరిఞ్చినారాయణశఙ్కరాత్మనే.
రిప్లయితొలగించండిరాఘవ గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. నాకు తెలిసినది నలుగురితో పంచుకోవాలని ఓ చిన్న ప్రయత్నం.
రిప్లయితొలగించండితండ్రి గురించి వ్రాసినారు.. ఎంతో ఆనందం
రిప్లయితొలగించండిadbhuta mandi guruvu gaaru
రిప్లయితొలగించండి