దేశ భక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేశ భక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, అక్టోబర్ 2011, బుధవారం

రాలీ, నార్త్ కరోలినాలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులు

అక్టోబరు, 2, 2011, Raleigh, NC.  అమెరికా లోని  నార్త్  కరోలినాలో రాష్ట్రానికి రాజధాని అయిన ర్యాలీ నగరంలో "Heritage India Association, NC" అధ్వర్యంలో గాంధీజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  గాంధీ స్టేట్యూ ప్రాజెక్టును డా.అరవింద్ షా 2005 లో ప్రారంభించారు. డా. షా  నేతృత్వంలో ప్రాజక్టు ప్రెసిడెంటు గా నియమించ బడిన శ్రీమతి యశ్ గార్గ్, వైస్ ప్రెసిడెంట్ హర్ష షా మరియు వివిధ వాణిజ్య సంస్థలు, స్వచ్చంద సేవకులు, స్థానిక "ఎక్స్ ప్లోరిస్" మ్యూజియము వారు కలసి ఈ ప్రాజక్టు ద్వారా చందాల రూపంలో, సౌజన్య రూపంలో నగదు సేకరించి ర్యాలీ నగరం డౌన్ టౌన్లోగల మ్యూజియము ప్రాంగణం లో జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహం 2006 లో ప్రతిష్టించారు.  ఈ విగ్రహాన్ని భారత దేశంలో తయారు చేయించి, తీసుకు వచ్చే బృహత్తర భారాన్ని శ్రీ వంగూరి ప్రసాద్ గారు (past president of IAFPE-NC Chapter) చేపట్టారు.  హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో పలువురు స్థానిక భారతీయులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో తొలుత డా. షా గారు ఈ ప్రాజక్టు పూర్వోత్తరాలు వివరించారు.  తదుపరి శ్రీ దేవలపల్లి ప్రకాష్ గారు పరిచయ వాక్యాలు పలికారు.  అటు పిమ్మట మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ జగదీశ్ నారాయణ్ గారు పూల మాల వేసి తనకు గాంధీ గారి సిద్ధాంతాలతో గల అనుభవాన్ని వివరించారు.  కార్యక్రమానికి హాజరైన ప్రతి వొక్కరూ ముక్త కంఠంతో "రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరో నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్" అని ప్రార్థించారు.  తరువాత ఆడిటోరియం లో HSNC కి చెందిన శ్రీమతి సరోజ్ శర్మ గారు జ్యోతిని వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభింప జేజారు. స్థానిక భారతీయ సంతతికి చెందిన రెండవ తరం పిల్లలు నృత్య, గాన కార్యక్రమాలతో సభాసదులను అలరించారు. పలువురు బాల బాలికలు గాంధీ గారి చాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసారు. "గాంధీని పోలిన" (Gandhi look-alike) వస్త్ర ధారణ పోటీలో గెలుపొందిన బాలురకు బహుమతులు పంచి పెట్టారు.

 గాంధీ ప్రోజక్టుకు సంబంధించిన కొంత సమాచారాన్నిఈ వెబ్ సైట్ నుండి గ్రహించడమైనది : http://www.apnatriangle.com/Apna-Triangle-Articles/gandhi-statue-rtp 
Person interviewing in Gandhi T-Shirt: Suryanarayana Vulimiri
Video is Curtesy of Gowri Goli.

2, అక్టోబర్ 2011, ఆదివారం

గాంధీ పై భావోద్వేగమైన సిరివెన్నెల గీతం - గుండె లోనుండి గొంతు లోకి


మహాత్మా గాంధి

రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారామ్
ఈశ్వర అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్


సిరివెన్నెల గారి కలానికి ఒక రసం మాత్రమె అన్న హద్దు లేదు. భక్తీ గీతాలు, శాస్త్రీయ సంగీతానికి అనువైన విలక్షణ గీతాలు,  ప్రేమ గీతాలు, విరహ గీతాలు, దేశ భక్తి గీతాలు, విప్లవ గీతాలు, ఒకటేమిటి ఏ కోణంలో చూసినా ఆయన ఒక్కో రూపాన్ని చూపిస్తారు మనకు. మహాత్మా గాంధీ పై 'మహాత్మా' చిత్రం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వ్రాసిన ఈ పాట తెలుగు హృదయాలలో కలలాలం నిలిచిపోయే పాట - ఆయన గుండెలోంచి సగటు భారతీయుని హృదయ ప్రతిధ్వని గా..




 బాలు గళంలో 'మహాత్మా' చిత్రం' నుండి. అయితే సెన్సార్ కత్తెర ప్రభావం పాటలో ప్రస్ఫుటిస్తుంది. ఇందులో కొంప ములిగిపోయే అంత అభ్యంతరం ఏమిటో? ఇందిరమ్మను తొలగించి 'కొంతమంది' అని మార్చినట్లున్నారు. ఇదీ మనకుండే స్వేచ్చ.  ఈ పాట చిత్రీకరణ చాల బాగా చేసారు ఈ చిత్రంలో. ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కంట నీరు పెట్టిస్తుండీ చరమాంకం.


చిత్రం: మహాత్మ (2009)
రచన: సిరివెన్నెల 
గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం 
సంగీతం: విజయ్ ఎంతోనీ 

సాకీ:  రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారామ్
        ఈశ్వర అల్లా తెరో నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్

చ:     కొంతమంది (ఇందిరమ్మ) ఇంటి పేరు కాదుర గాంధి
        ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి (2)
        కరన్సీ నోటు మీద, ఇలా నడి రోడ్డు మీద
        మనం చూస్థున్న బొమ్మ కాదుర గాంధి
        భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధి
        తర తరాల యమ యాతన తీర్చిన వరదాతరా గాంధి
        ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధి
        ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి

చ:     రామ నామమే తలపంతా, ప్రేమ ధామమే మనసంతా
        ఆ శ్రమ దీక్షా స్వతంత్ర కాంక్షా
        ఆకృతి దాల్చిన అవదూత, అపురూపం ఆ చరిత
        కర్మ యోగమే జన్మంతా, ధర్మ క్షెత్రమే బ్రతుకంతా
        సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత
        ఈ బోసి నోటి తాతా
        మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధి
        మహత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి
        సత్యాహింసల మార్గ (స్వర్ణ) జ్యోతి, నవ శకానికే నాంది
        ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధి
        ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి 

చ:     గుప్పెడు ఉప్పును పోగేసి, నిప్పుల ఉప్పెనగా చేసి
        దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత
        సిసలైన జగజ్జేత  ...
        చరఖా యంత్రం చూపించి, స్వదేశి సూత్రం నేర్పించి
        నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత
        సంకల్ప బలం చేత..
        సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన కాంతి
        తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేఛ్చా భానుడి ప్రభాత కాంతి
        పదవులు కోరని పావన మూర్తి, హృదయాలేలిన చక్రవర్తి
        ఇలాంతి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
        నమ్మరానిదని నమ్మకముండే ముందు తరాలకి చెప్పండి
        సర్వ జన హితం నా మతం

        అంటరాని తనాన్ని అంతః కలహాలన్ని అంతం చేసేందుకే
        నా ఆయువంతా అంకితం, హే రామ్ 

మహాత్మునికి అశ్రు నివాళులతో
జై హింద్!

20, ఆగస్టు 2011, శనివారం

జన గణమన పూర్తి గీతం - 39 మంది ప్రముఖ గాయనీ గాయకుల గళాలలో

ఇదేమిటి స్వాతంత్ర్య దినోత్సవం అయిన నాలుగు రోజులకు గుర్తొచ్చిందా ఈ శీర్షికపై బ్లాగు వ్రాయడానికి అనుకోవచ్చు. కాని ఇప్పుడే ఈ గీతం గురించి తెలిసింది. అందరికి తెలుసు మన జాతీయ గీతమైన  "జనగణమన అధినాయక జయహే! భారత భాగ్య విధాత!" రచించినది విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ రవీంద్ర నాథ్ టాగోర్ (1861-1941) అని. అయితే ఆయన వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమె మన జాతీయ గీతం లో చేర్చడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే ఈ గీతానికి బాణీ కూర్చడం తెలుగు నేలపై జరిగింది, అది శ్రీ టాగోర్ గారు మదన పల్లె సందర్శించిన తరుణంలో.

ప్రస్తుతం శ్రీ టాగోర్ 150 వ జన్మ దినం సందర్భంగా ఆయన వ్రాసిన ఈ గీతం భారతమాత ముద్దు బిడ్డలయిన 39 మంది కళాకారులు, ఎక్కువగా గాయనీ గాయకులూ, కొద్ది మంది వాద్య సంగీతజ్ఞులు పాల్గొన్న ఈ వీడియో ఆగస్ట్ 12, 2011 న, అంటే స్వాతంత్ర్య దినోత్సవానికి మూడు రోజుల ముందు "జయ హే! " అన్న పేరుతో  "Times of India" విడుదల చేసింది. చరణాల మధ్య ఆంగ్ల వ్యాఖ్యానం ఆయా చరణాల అర్ధాన్ని వివరిస్తూ చక్కగా వుంది. ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూడవలసిన రికార్డింగు ఇది. ఈ గీతం మౌలికంగా వంగ భాషలో వ్రాయగా (ఎక్కువ సంస్కృత పదాలున్నాయి), సాహిత్యాన్ని 'వికి పీడియా' నుండి సేకరించి వీలయినంత విని పదాలను సరిదిద్దాను. కాని కొన్నిసవరణలు ఉంటే సూచించగలరు. ఈ గీతం ఇన్ని గళాలలో వింటుంటే ఒళ్ళు ఆనందంతో పులకరించింది. ఏదో తెలియని మధురానుభూతి కలిగింది. ఇప్పుడున్న అన్ని సమస్యలు మరచి పోయి అంతా సామరస్యం తో ఆలోచిస్తే అందులో ఎంత హాయి ఉంటుందో తెలుస్తుంది.  ఆ ఆశాభావంతో ఈ గీతం వినండి.



గాయనీ గాయకులు, వాద్య విద్వాంసులు: కవితా కృష్ణమూర్తి, ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్, గిరిజా దేవి, ఉషా ఉతుప్, హరిహరన్, అల్కా యాజ్ఞిక్, సురేష్ వడేకర్, పండిత్ జస్‍రాజ్, సునిధి చౌహాన్, కైలాశ్ ఖేర్, రేఖా భరద్వాజ్, రూప్ కుమార్ రథోడ్, సునాలి రథోడ్, సౌమ్యొజిత్ దాస్, సౌరెంద్రొ మల్లిక్, పండిత్ శివ్ కుమార్ శర్మ, చిత్ర, జగ్‍జీత్ సింగ్, నిత్యశ్రీ మహదేవన్, శ్రీనివాస్, పి. సుశీల, సోను నిగమ్, పండిత్ విశ్వ్ మోహన్ భట్,  పండిత్ అజొయ్ చక్రబర్తి, రిచా శర్మ, మహలక్ష్మి అయ్యర్, శంకర్ మహదేవన్, డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, డా. ఎల్. సుబ్రహ్మణ్యమ్, అంబి సుబ్రహ్మణ్యమ్, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, సాధనా సర్‍గమ్, జావేద్ ఆలి, లెస్లే లెవిస్, లక్ష్మణ్ దాస్ బౌల్, లోపాముద్ర మిత్ర, శ్రీకాంత్ ఆచార్య, శ్రాబణి సేన్, షాన్.   (పేర్లు వీడియోలో కళాకారులు కనిపించే వరుస క్రమంలో)      
  సంపూర్ణ జాతీయ గీతం
జయ హే! జయ హే! జయ హే! జయ హే! జయ హే! జయ హే! జయ హే! 
చ1.   జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
       పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
       వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
       తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే
       గాహే తవ జయ గాథా
       జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

చ2.  అహరహ తవ ఆహ్‍బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి)
       హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని
       పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే
       ప్రేమ్ హార్ హొయె గాథా
       జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

చ3.  పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి
       హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
       దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
       సంకట దుఃఖ త్రాతా
       జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

చ4.  ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
       జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
       దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే
       స్నేహమయి తుమి మాథా
       జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

చ5.  రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే
       గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
       తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే
       తవ చరణె నత మాథా
       జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
       జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
జైహింద్ 

15, ఆగస్టు 2011, సోమవారం

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! - అదీ సిరివెన్నెలంటే !!

భారత మాత 1947 ఆగస్టు పదిహేను అర్ధరాత్రి దాస్య శృంఖలాల నుండి విముక్తురాలు అయ్యింది. ప్రజలంతా సంబర పడ్డారు.  అయితే స్వరాజ్యం రావడంతో మన కర్తవ్యం పూర్తి కాలేదు, అసలు ప్రగతి అంతా ముందుంది అని,  "స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి" అని అలనాడు తన పెన్నుతో మన వెన్ను తట్టి హెచ్చరించారు మహాకవి శ్రీశ్రీ. 

తరువాత స్వాతంత్ర్యం వచ్చిన అయిదు పదులకు దేశ రాజకీయ వాతావరణం లో చాల మార్పులు వచ్చాయి. కాని సగటు మనిషి జీవితంలో మార్పు రాలేదు. ఇంతలో నక్సలిజం రాజుకుంది. ఆ నేపథ్యంలో విడుదలయిన చిత్రం "సిందూరం". 'కృష్ణ వంశీ' దర్శకత్వంలో విడుదలయిన ఈ చిత్రం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్ ను, మరియు ఫిలిం ఫేర్ అవార్డును గెలుచుకుంది. ఈచిత్రంలో ఒక మరపురాని గీతం వ్రాసినది శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.  వారి కలం, కత్తి కన్నా పదునైనదని నిరూపించిన గీతం ఇది. నిజానికి చిత్ర నిర్మాణం పూర్తయి, ప్రీవ్యూ చూసి బయటకు వచ్చిన తరువాత కలిగిన స్పందన తో అప్పటికప్పుడు శాస్త్రి గారి కలం-గళం నుండి పెల్లుబికిన కవితావేశం ఈ గీతం అని కృష్ణవంశీ గారి మాటలలో తెలిసింది. 

ప్రస్తుతం మనకు స్వాతంత్ర్యం వచ్చి ఆరు పదులు పైబడింది.అయినా సగటు రాజకీయ వాతావరణంలో మార్పు ఏ మాత్రంలేదు. కాకపోతే, మార్పుకోసం దశాబ్దానికొక కొత్త అలజడి, ఒక కొత్త ఉన్మాదం, వెరసి ఇదీ మన ప్రగతి గతి. వాస్తవానికొస్తే, ఈ పాట వింటుంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది. మనసులో ఆశావాదం నిండి వున్నా ఒక్కోసారి నైరాశ్యం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటుంది. సిరివెన్నెల గారు తన పాటలో పలుకులో ఆ ఆవేదనను సాధారణ పదాలతో చక్కగా, స్పష్టంగా వ్యక్తం చేసారు.  దిగువన కృష్ణ వంశీ గారి ముందు మాట, సిరివెన్నెల గారితో ఇంటర్ వ్యూ, ఈ పాట సాహిత్యం పొందు పరస్తున్నాను. పాట పాడినది మరెవరో కాదు, బహుగళ గానగంధర్వుడు బాలు.





వీడియోలో మొత్తం పాట దొరకలేదు. పూర్తి పాటను (మూడు చరణాలు) క్రింది ఆడియో లింకులో వినవచ్చును.

 
ప. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
     ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా! 
    శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
    నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!
       

     అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
    నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!

చ. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ
     ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే 
    సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
    మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
    అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?
    ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
    జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా! 
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
     ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా! 
 
చ. అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం 
    కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా! వెలుగుని తప్పుకు తిరగాలా!
    శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం
    స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా! అన్నల చేతిలో చావాలా!
     తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి
     ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే 
     నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం, ఈ సంధ్యా సిందూరం
     వేకువ వైపా, చీకటి లోకా ఎటు నడిపేవమ్మా! గతి తోచని భారతమా! 

     అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
     యుద్ధ నినాదపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దాన్ని సవాలు చేద్దామా!

చ. తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని
     తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
     ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
     కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
     ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం
     కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితి మంటల సిందూరం
     చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా! ఓ విషాద భారతమా 

     
     అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
     ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
    శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
    నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!
       

     అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
    నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!

 ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశిద్దాం!
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

*యూ ట్యూబ్ లో దొరికిన వీడియో (divyakshar.blgospot) శ్రీ లోకేష్ గారిదని గ్రహించాను. వారి "మధుర గీతాలు" బ్లాగులో మరిన్ని పాటలున్నాయి. వారు నాకు తెలియక పోయినా, వారి వీడియో క్లిప్ వాడుకున్నందుకు క్షమించగలరు.

31, జనవరి 2011, సోమవారం

ఓ బాపూ నీకు నీవే సాటి

1869-1948
"గాంధీ పుట్టిన దేశం రఘు రాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం" అని ఒకరంటే, ఇంకొకరు "గాంధి పుట్టిన దేశమా యిది నెహ్రు కోరిన సంఘమా ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా" అంటారు.  
      నాణానికి రెండువైపులు ఉన్నట్లు రేపటి వెలుగును చూస్తామన్న ఆశావాదం ఒకవైపు. నలుదిక్కుల ఆవరించిన కటిక చీకట్లు తప్ప అరుణ కిరణాలను చూడలేమన్న నిరాశావాదం మరొక వైపు. 
      అప్పటికీ ఇప్పటికీ ఏం తేడా లేదు. అసలు ఎప్పటికీ మార్పు రాదు. నీ బొమ్మకు దండవేసి చేతులు దులుపుకునే రాజకీయం నిన్ననుసరించాలని అనుకోదు. అదంతా ఒక పబ్లిసిటీ స్టంటు.  
      ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలన్న నీవంటి మహాత్ముడిని  అయిదు సార్లు నిరాకరించింది నోబెల్ సంస్థ నీకు పురస్కారం ఇవ్వడానికి. ఇలాంటి సంస్థ ఉంటేనేం లేకుంటే ఏం? అసలు నిన్ను తిరస్కరించిన నాడే పడిపోయింది దీని విలువ. 
      "మహాత్ముడే కలలుగన్న మరో ప్రపంచం" కేవలం ఒక కల మాత్రమే అనిపిస్తుంది. అధికారం కోరకుండా ప్రజా సేవ చేసే వారు ఈ కాలంలో లేరు. ఎందఱో నకిలీలు ఈ రోజు నీ పేరు చెప్పుకుని బతికేస్తున్నారు. నిజమైన గాంధేయ వాదులు అపుడో కాలం చేసారు. 
      ఎవరు నిన్ను, నీ ఆశయాలను ఆదరించినా లేకపోయినా ఓ బాపూ నీకు నీవే సాటి. నీవు నుడివిన వాక్కులు 
"రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్" 
అనేవి అక్షర సత్యాలు. నీ వర్ధంతి నాడు ఇవే నా అశ్రు నివాళులు. అందుకో ఓ బాపూ!

25, జనవరి 2011, మంగళవారం

వందనం చేసే జాతీయ గీతం వంద ఏళ్ళ చరిత్ర గలది

విశ్వకవి రవీంద్రుడు (రవీంద్ర నాథ టాగోర్) మన జాతీయ గీతమైన "జనగణమన అధినాయక జయహే! భారత భాగ్య విధాత" ను తొలుత వంగ (బెంగాలి) భాషలో, ఎక్కువగా సంస్కృత పదాలతో రచించారు. మొదటి సారిగా ఈ గీతాన్ని కలకత్తా లో 1911 డిసెంబరు 27 న జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం లో పాడటం జరిగింది. అయితే ఈ జాతీయ గీతాన్ని జనవరి 24, 1950 లో అధికారికంగా జాతీయ ప్రతిపత్తి కల్గించారు. అంటే ఇప్పటికి సుమారు వంద సంవత్సరాల క్రిందట పుట్టిన ఈ గీతం జాతీయత సంతరించుకుని సుమారు ఆరు దశాబ్దాలు అయింది అన్నమాట. జనవరి 26 కు శ్రీ భీంరావ్ రాంజీ అంబేద్కర్ సమకూర్చిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఆ దినం "గణతంత్ర దినం" (Republic Day) గా పరిగణన లోనికి వచ్చింది.

తెలుగు నేల పై జాతీయ గీతం స్వరకల్పన:

అయితే చెప్పుకో దగ్గ విషయం ఏమిటంటే ఈ జాతీయ గీతాన్ని బెంగాలీ భాష నుండి ఆంగ్లంలోకి అనువదించడం,  స్వరపరచడం తెలుగు నేల పై జరిగాయి అని ఎందరికి తెలుసు?  నాకు ఈ మధ్యనే తెలిసింది. ఎక్కడ అంటే చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో.   ఇక్కడ గల "అనీబిసెంట్ థియోసాఫికల్ సొసైటీ" లో పాస్టర్ అయిన జేమ్స్ కజిన్స్ అనే ఆయన ఆహ్వానం మీద టాగోర్ గారు ఆంద్ర ప్రదేశ్ ను సందర్శినారట.  వారు మదన పల్లి  (చిత్తూరు జిల్లా) కు వచ్చారని వార్త. టాగోర్ గారు తెలుగు నేలను దర్శించినపుడు మన జాతీయ గీతానికి ఆంగ్ల అనువాదం చేసారు. అదే సందర్భంలో జేమ్స్ కజిన్స్ గారి శ్రీమతి అయిన మార్గరెట్ కజిన్సు తో కలసి జాతీయ గీతానికి స్వరకల్పన చేసారని వికి పీడియా సమాచారం. ఇది నిజంగా తెలుగువారమైన మనందరమూ గర్వించ దగ్గ విషయం.

ఘంటసాల గళం లో మన "జనగణమన" 

నేను చిన్నప్పటి నుండి ఘంటసాల అభిమానిని. ఆయన పాడిన సినిమా పాటలు, ప్రైవేటు గీతాలు చాల విన్నాను. అయితే వారి గళంలో జనగణమన వినడం ఈ మధ్యనే తటస్థించింది. అది "ప్రాజెక్ట్ ఘంటసాల" ద్వారా శ్రీ బొల్లా ప్రగడ సోమేశ్వర రావు గారి ఇ-లేఖ ద్వారా. అప్పటి వరకు ఘంటసాల గారి గళంలో జనగణమన విని ఎరుగను.  చాల మందికి తెలిసే ఉండవచ్చు.  ఘంటసాల గారు పాడిన జాతీయ గీతం ఆడియో ను క్రింది లంకె లో వినవచ్చును. 




Blog Junctions