జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, అక్టోబర్ 2011, శుక్రవారం

చీకటి గుహలలో వింటున్నానే నా గుండెల చప్పుడు

అవి నేను తిరుపతి వెటర్నరీ కాలేజిలో మైక్రోబయాలజీ లో పోస్టు గ్రాడ్యువేషన్ చేసే రోజులు. అండర్ గ్రాడ్యువేట్లకు ఉండే గదుల కన్నా, పోస్టు గ్రాడ్యువేట్లకుండే గదులు సౌకర్యంగా ఉండేవి. రూముకి ఇద్దరు మాత్రమె ఉండేవారు. పోస్టు గ్రాడ్యువేట్ల హాస్టలు పేరు "నకుల".  అండర్ గ్రాడ్యువేట్ల హాస్టలు పేరు "సహదేవ". ఈ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా! నకుల సహదేవులు గోవుల పోషణ మరియు అశ్వ పోషణ లో నిపుణులు. అంటే వేటరినేరియన్స్ అన్న మాట. అందుకే విరాట రాజు కొలువులో వారి పాత్ర గోరక్షణ మరియు అశ్వ రక్షణ. 

సరే ఇక పాయింటుకొస్తే, నేను, మా రూము మేటు కే.వి.ఎల్.నరసింహారావు రూములో చాల తక్కువ మాట్లాడుకొనే వాళ్ళం. కాని మూడో వ్యక్తి వస్తే మాత్రం అయిపోయాడన్నమాటే.  అందువల మేమిద్దరం రూంలో వున్నపుడు ఎవరూ రావడానికి సాహసించే వారు కారు. కాని దానికి ఒక ఎక్సెప్షన్ వుంది.   మా సహ విద్యార్థి శ్రీనివాస రావు (శ్రీ.రావు) కి తనొక గొప్ప కవినని ఫీలింగు. ఎప్పుడూ తన తాజా తాజా కవితలతో కనిపించిన వాళ్ళనందరినీ వినమని వేధించే వాడు. "ఏయ్! గురూ ఈ రోజు ఒక కొత్త కవిత వ్రాసాను" అని ఉదయాన్నే ప్రత్యక్షమయే వాడు. కొన్నాళ్ళు భరించాం. కాని ఇక లాభం లేదని, ఒకరోజు మెస్సులో రెచ్చిపోవడానికి ప్రయత్నించాగానే, కే.వి.ఎల్. కొంచెం విసుగుతో " ఏంటయా నీ కొత్త కవిత" అనేసరికి శ్రీనివాసరావుకి ఉత్సాహం వచ్చింది. వెంటనే అందుకున్నాడు. "నా ప్రియురాలి నవ్వు లావా క్రేటర్ లా వుంది" అని మొదలు పెట్టేసరికి...

కే.వి.ఎల్. కి వొళ్ళు మండి "ఇదీ ఒక కవితేనా", "అయినా ఈ రోజుల్లో  చంద్రముఖి అని కూడా ఎవరూ అనడం లేదు. ఎందుకంటే, నీ ప్రియురాలికి ముఖం నిండా మచ్చలున్నాయా అంటారు. మరలాటిది లావా క్రేటర్ అంటే నిండా గోతులనా అర్థం?"  అని తెనాలి రామకృష్ణ లాగ అనేసరికి, శ్రీనివాస రావు కు కోపం వచ్చింది. 

శ్రీ.రావు, "కవిత్వం వ్రాయడమంటే అంత సులభం కాదు",  "అయితే నేనొక సమస్యా పూరణం ఇస్తాను, పూరించు" అని సవాలు చేసాడు. దానికి కే.వి.ఎల్. "ఓ! నువ్వు పూర్ణం ఇస్తే నే బొబ్బట్లు చేస్తా కవితలతో" అన్నాడు. దానికి శ్రీ.రావు.."చీకటి గుహలలో వింటున్నానే నా గుండెల చప్పుడు" ఇదే సమస్య, పూరించు అన్నాడు. దానికి కే.వి.ఎల్. "ఓస్ అంతేనా! అయితే విను" అని తడుముకోకుండా ఇలా పూరించాడు..

"శ్రీనివాసరావు కవిత్వం వినలేక, 
విని చావ లేక, చచ్చి బ్రతకలేక, 
అడవిలోకి పారిపోయి, చీకటి గుహల్లో
వింటున్నానే నా గుండెల చప్పుడు"

శ్రీనివాస రావుకి కోపం వచ్చినా, తమాయించుకుని "భలే చెప్పావయ్యా. అసలు నీకు ఇంత కవితా పటిమ ఉందని నాకు తెలియదు. ఏదీ ఆశువుగా ఒక కవిత చెప్పు" అన్నాడు. ఈ సారి కే.వి.ఎల్. ఒక్క క్షణం ఆలోచించి "సరే విను" అని ఇలా అన్నాడు.

"మన భాష తెలుగు, 
మనకు కావాలి వెలుగు, 
అని నువ్వందుకుంటే కవితా పలుగు, 
మేమంతా ఒకటే పరుగు" 

అని ముగించగానే మా మెస్సులో అప్పటిదాకా ఈ చోద్యం చూస్తున్న మిగిలిన విద్యార్థులంతా ఒక్కసారి చప్పట్లతో ముంచెత్తారు. కళాశాల కబుర్లు, జ్ఞాపకాలు, ఆనాటి అల్లరి పనులు గుర్తుకు వచ్చినపుడు మళ్ళీ గతంలోకి జారిపోతే బాగుండుననిపిస్తుంది. కాని ఆ మధుర క్షణాలు మళ్ళా రావుగా. అప్పటి అనుభూతులని, అనుభవాలని నెమరు వేసుకుని ముందుకు సాగిపోదాం.

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

పదివేల చూపుల స్నేహమయము, అదివో అల్లదివో బ్లాగుల వాసము


 పదివేల
బ్లాగ్-వీక్షకులకు, మిత్రులకు కృతజ్ఞతలు
     
      నేను బ్లాగు ప్రపంచంలో అడుగు పెట్టి ఏడాది ఇంకా పూర్తి కాలేదు. పదివేల మంది రస హృదయులు నాబ్లాగ్ ను వీక్షించారు.  మీ అందరి సహకారం, స్నేహ స్పర్శ నాకెంతో స్ఫూర్తిని, ఆనందాన్ని ఇచ్చాయి. మీ అందరి సావాసం నాకు బ్లాగు నివాసం అయ్యింది.  అందుకే అనిపిస్తుంది "పదివేల చూపుల స్నేహమయము, అదివో అల్లదివో బ్లాగుల వాసము".  నా స్నేహితులు కూడా ఒకోసారి అంటుంటారు. "ఏంటండీ! మిమ్మల్ని చూసి చాల రోజులయింది.  అన్నట్లు బ్లాగుల్లో పడ్డారటగా!" అని.  అది చురకో, లేక మెచ్చుకోలో తెలియదు.  అదేదో రేసుల్లోనో, పేకాటలోనో పడ్డట్లు. అఫ్కోర్స్! ఇది కూడా అలాంటిదే. కొందరు దీన్ని వ్యాపకం అంటే కొందరు వ్యసనం అనొచ్చు.  కాని ఒకటి మాత్రం నిజం. బ్లాగులు వ్రాయడం ఒక దిన (వార) చర్య అయిపోయింది.  

        అంతరంగంలో అటునిటు దొర్లుతున్న ఆలోచనలను, స్వీయ అనుభవాలను అవగతం చేయడానికి ప్రారంభించాను నా మొదటి బ్లాగు "స్వగతం".  ఎందఱో పరిచిత మిత్రులు పలకరించారు, అపరిచితులైన రసజ్ఞులు మిత్రులైనారు. వారందరూ తమ హార్దిక స్పందన-ప్రతి స్పందనలతో సలహాలు, విమర్శలు, ఆశీస్సులు అందించారు. ఎన్నో క్రొత్త విషయాలు తెలిసాయి. ఇంకా తెలుసుకోవలసినవి చాల ఉన్నాయని తెలిసింది. ఇది ఒక అపురూపమైన చిరు ప్రారంభం.  అయితే "బ్లాగించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి" (క్షమించండి శ్రీశ్రీ గారు) అని నేనను కుంటాను. ఈ విధమైన ఆరోగ్యకరమైన పరంపర ఇలాగే కొనసాగాలని, కొనసాగుతుందని, దానికి మీ వంటి మంచి మిత్రుల సహాయ-సహకారాలైతేనేమి, అండ-దండలైతేనేమి కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ...
ప్రవాసంలో నివాసి 
సూర్య నారాయణ వులిమిరి  
  

7, ఆగస్టు 2011, ఆదివారం

షష్టి పూర్తికి చక్కని పాట

       పిల్లలను కని, పెంచి, పెద్దచేసి, చదువులు చెప్పిస్తారు తల్లిదండ్రులు. తరువాత పిల్లలకు రెక్కలు వచ్చి ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళే సందర్భాలు ఎక్కువ. ఈ యాంత్రిక యుగంలో ఇది పరిపాటి. తమకు జన్మనిచ్చి, భవిష్యత్తుకు బాటలు వేసిన అమ్మా-నాన్నలకు ఏమిచ్చినా వారి ఋణం తీరదు.  అయితే వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చే ఒక అవకాశం షష్టిపూర్తి. అరవై సంవత్సరాలు పూర్తి అయితే అది షష్టి పూర్తి. మన సంస్కృతిలో తండ్రికి జరిగే అరవైయవ జన్మదినం ఈ షష్టిపూర్తి మహోత్సవం. ఈ పాటలో తల్లిదండ్రులకు షష్టి పూర్తి జరుపుకుంటున్న పిల్లలు దైవస్వరూపులైన అమ్మా, నాన్నలను ఉద్దేశించి ఎలా పాడుతున్నారన్నది సారాంశం.  
        
         మేము హ్యూస్టన్, టెక్సాస్ నగరంలో ఉన్నపుడు మా మిత్రులు శ్రీ అహోబిలవఝ్ఝల మురళి గారు వ్రాయగా, శ్రీమతి చంద్రకాంత కోర్ట్ నీ గారు స్వరపరచారు ఈ పాటను.  ఈ పాట బాణీ కొద్దిగా 'అభిమానం' చిత్రం (1960) లో శ్రీశ్రీ వ్రాసిన జిక్కీ గారి పాట "తల్లిని మించి ధారుణి దైవం" కు దగ్గరగా వుంటుంది. ప్రస్తుతం నార్త్ కరోలినా (అమెరికా) లో మా మిత్రులైన శ్రీ వందన-ప్రకాష్ దేవలపల్లి గారి షష్ఠి పూర్తి సందర్భం గా ఈ పాట పాడాను. అయితే కొందరు మిత్రులు ఈ పాట సాహిత్యం అడిగారు. దానిని నా బ్లాగు ద్వారా పరిచయం చేస్తే బాగుంటుందనిపించింది. ఈ పాట రచయిత శ్రీ మురళి గారికి ధన్యవాదాలు. మురళి గారు ఈ పాటను దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం వ్రాసినా ఇంకా వారిని, వారి పాటను, మా హ్యూస్టన్ జ్ఞాపకాలను ఇప్పటికీ తలచుకుంటూ ఉంటాము - సూర్యనారాయణ వులిమిరి


షష్టి పూర్తి పాట  
రచన: శ్రీ మురళి అహోబిలవఝ్ఝల 


ప.  అమృతమూర్తులు, దైవ స్వరూపులు అమ్మా, నాన్నా మీరు
     మీ పద పూజా భాగ్యము మాకు  జన్మజన్మల సుకృతమూ             
     జన్మజన్మల సుకృతమూ                                                 ||అమృత||

చ. గీతా ధర్మము పాటించి, గీతా తత్వము బోధించి (2)
    విద్యాబుద్ధులు నేర్పించి, ధర్మాధర్మము వివరించి (2)
    మముగని పెంచిన మా యిలవేల్పులు అమ్మా, నాన్నా మీరు
    మీ పద పూజా భాగ్యము మాకు
    జన్మ జన్మలా తపబలమూ (2)                                          ||అమృత||

చ. సత్యవచనమే బలమని చెప్పి, గుణమే ఆభరణమ్మని తెలిపి (2)
    ఎదుటి వ్యక్తిలో లోపములెంచక గౌరవించు ఔన్నత్యము నేర్పి (2)
    మముగని పెంచిన మా యిలవేల్పులు అమ్మా, నాన్నా మీరు
    మీ పద పూజా భాగ్యము మాకు
    జన్మ జన్మలా సుకృతమూ (2)                                          ||అమృత||

చ. చదువులు, పదవులు వేరైనా, మా ఉద్యోగాలు ఏవైనా (2)
    అమ్మా, నాన్నా మా అందరికి మీ పదధూళే పదివేలు
    దీవెనలే శ్రీరామరక్షలు
    మముగని పెంచిన మా యిలవేల్పులు అమ్మా, నాన్నా మీరు
    మీ పద పూజా భాగ్యము మాకు
    ఎన్నో జన్మలా సుకృతమూ (2)                                         ||అమృత||

Blog Junctions