శుభాకాంక్షలు
సూర్యుడు మన ప్రత్యక్ష దైవము. అతడు అన్ని
జీవరాశులకు ఆధారము, ఆలంబన అందించే అద్భుతమైన తేజోరాశి. ఖగోళ శాస్త్రం రవిని
స్థిరతారగా గుర్తించి అన్ని గ్రహాలు ఆదిత్యుని చుట్టూ పరిభ్రమిస్తాయని ఋజువు
చేసినా మనం అనుసరించేది చూసేది గ్రహకూటముల, నక్షత్ర రాశుల గతులు మరియు సూర్యగమనం. మనకున్నవి పన్నెండు రాశులు. సూర్యుడు నెలకొక
రాశిలో కాలం గడిపి, ఆ తరుణం గడచిన పిదప ఒక రాశిని వదలి తరువాతి రాశి రాశిలో
ప్రవేశిస్తుంటాడు. సూర్యుని ప్రవేశం
జరిగిన రాశికి సూర్యుడు సంక్రమిస్తాడు. అదే సంక్రమణం. దీనినే సంక్రాంతి అంటాము.
అలా సూర్యుడు పన్నెండు రాశులకు పన్నెండు సంక్రాంతులు కలిగిస్తాడు. అయితే ఇందులో
ముఖ్యమైనది మకర సంక్రాంతి. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం. ఇది సూర్యుని ఉత్తరదిక్కు ప్రయాణం. ఈ
ప్రయాణాన్నే ఆయనం లేదా ఆయణం అంటారు. ఉత్తరాయణం శుభప్రదమైనది. ఇది పుణ్యకాల
ప్రారంభం. ఈ పుణ్యకాలంలో శుభకార్యాలు జరుపుకుంటారు ఎక్కువగా. ఈ పుణ్యకాలం కోసమే
తండ్రి శంతనుని నుండి స్వచ్ఛంద మరణం వరంగా పొందిన కురుపితామహుడైన భీష్ముడు
కురుక్షేత్ర యుద్ధంలో విపరీతంగా గాయపడి ఒరిగినపుడు అర్జునుడు అమర్చిన అంపశయ్యపై
ఉత్తరాయణ ఆరంభమయే వరకు నిరీక్షించాలనుకుంటాడు.
ఉత్తరాయణ శుభారంభం అయిన మకర సంక్రాంతి చాల
విశిష్టమైనది. ఉత్తరాయణంలో సూర్యునిగమనం ఉత్తరముఖంగా మారడంతో పగటికాలం క్రమం గా
పెరుగుతూ వస్తుంది. సూర్యరశ్మి క్రిమి సంహారిణి. అది అందరికీ ఆరోగ్యాన్ని
కలిగిస్తుంది. అయితే సూర్యునికిరణాలు
ఎక్కువగా సోకితే అది మనకు కూడ మంచిదికాదు. ఎందుకంటే సూర్యరశ్మి లోని అతి నీలలోహిత
కిరణాలు చర్మవ్యాధులను, చర్మ సంబంధమైన కాన్సర్ ను ఇతర రుగ్మతలను కలిగిస్తుంది.
మకర సంక్రాంతి మనకు శుభతరుణం. సంక్రాంతి మనకు తెస్తుంది క్రొత్త కాంతి. ఈ
పండగ ముఖ్యంగా మూడు దినాలు. భోగి, సంక్రాంతి, కనుము.
సంక్రాంతికి ముందు రోజు భోగి.
ఈ రోజు తూర్పు తెల్లారక ముందే నిద్ర లేచి భోగిమంట వేస్తారు. పిల్లలు ఆవు పేడతో
చేసిన భోగిపిడకలు దండలుగా గుచ్చి భోగి మంటలో వేస్తారు. భోగి దినం సాయంత్రం
పసిపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగిపళ్ళులో నేరేడు పళ్ళు, కొత్త పైసలు, చెరుకు
ముక్కలు, చాక్ లేట్లు కలిపి పసిపిల్లలను ఎవరి ఒడిలోనైనా కూర్చోపెట్టి తలమీదుగా
జారుతూ భోగి పళ్ళు పోస్తారు.
మరునాడు సంక్రాంతి పండుగ. ఇదే మకర సంక్రాంతి. ఇది
ముఖ్యంగా దీనినే పెద్ద పండుగ అంటారు. పండిన పంటలు నూర్పుకు వచ్చి, తమ కష్టానికి
ప్రతిఫలం లభించిన రైతులు పెద్దయెత్తున ఈ పండగ జరుపుకుంటారు. ఇళ్ళముందు ముదితలు, ఆడ
పిల్లలు పేడ నీళ్ళతో కల్లాపి జల్లి, ముగ్గులు పెట్టి, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు.
పగటి పూడ గాలిపటాల (పతంగుల) పండగ ఉంటుంది. ఇళ్ళలో బొమ్మల కొలువులు పెడతారు. హరిదాసులు ఇంటింటికీ తిరిగి రావమ్మా మహాలక్షి
రావమ్మ అని పాడుతుంటారు.
కనుమును పశువుల పండుగ అని కూడ అంటారు. రైతులు
గంగిరెద్దులను అలంకరించి ప్రతి యింటికి పోయి అయ్యవారికి దండం పెట్టు! అమ్మగారికి
దండం పెట్టు అని సన్నాయి వాయిస్తూ గృహస్థుల నుండి బియ్యం, కానుకలు
గ్రహిస్తారు. ఆవిధంగా సంక్రాంతి పండుగను
మీరందరు ఆనందంగా జరుపుకోవాలని నా (మా) ఆకాంక్ష.
మోరిస్ విల్, నార్త్ కరోలినా
అ.స.రా.
Sankranthi Subhakankshalu
రిప్లయితొలగించండిసూరి గారు,
రిప్లయితొలగించండిఅద్భుతమైన వ్యాసం, మకర సంక్రాంతి గురించి చాల చక్కగా వివరించారు.
మీకు మరియు మీ కుటుంబ సబ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.