7, ఆగస్టు 2011, ఆదివారం

షష్టి పూర్తికి చక్కని పాట

       పిల్లలను కని, పెంచి, పెద్దచేసి, చదువులు చెప్పిస్తారు తల్లిదండ్రులు. తరువాత పిల్లలకు రెక్కలు వచ్చి ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళే సందర్భాలు ఎక్కువ. ఈ యాంత్రిక యుగంలో ఇది పరిపాటి. తమకు జన్మనిచ్చి, భవిష్యత్తుకు బాటలు వేసిన అమ్మా-నాన్నలకు ఏమిచ్చినా వారి ఋణం తీరదు.  అయితే వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చే ఒక అవకాశం షష్టిపూర్తి. అరవై సంవత్సరాలు పూర్తి అయితే అది షష్టి పూర్తి. మన సంస్కృతిలో తండ్రికి జరిగే అరవైయవ జన్మదినం ఈ షష్టిపూర్తి మహోత్సవం. ఈ పాటలో తల్లిదండ్రులకు షష్టి పూర్తి జరుపుకుంటున్న పిల్లలు దైవస్వరూపులైన అమ్మా, నాన్నలను ఉద్దేశించి ఎలా పాడుతున్నారన్నది సారాంశం.  
        
         మేము హ్యూస్టన్, టెక్సాస్ నగరంలో ఉన్నపుడు మా మిత్రులు శ్రీ అహోబిలవఝ్ఝల మురళి గారు వ్రాయగా, శ్రీమతి చంద్రకాంత కోర్ట్ నీ గారు స్వరపరచారు ఈ పాటను.  ఈ పాట బాణీ కొద్దిగా 'అభిమానం' చిత్రం (1960) లో శ్రీశ్రీ వ్రాసిన జిక్కీ గారి పాట "తల్లిని మించి ధారుణి దైవం" కు దగ్గరగా వుంటుంది. ప్రస్తుతం నార్త్ కరోలినా (అమెరికా) లో మా మిత్రులైన శ్రీ వందన-ప్రకాష్ దేవలపల్లి గారి షష్ఠి పూర్తి సందర్భం గా ఈ పాట పాడాను. అయితే కొందరు మిత్రులు ఈ పాట సాహిత్యం అడిగారు. దానిని నా బ్లాగు ద్వారా పరిచయం చేస్తే బాగుంటుందనిపించింది. ఈ పాట రచయిత శ్రీ మురళి గారికి ధన్యవాదాలు. మురళి గారు ఈ పాటను దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం వ్రాసినా ఇంకా వారిని, వారి పాటను, మా హ్యూస్టన్ జ్ఞాపకాలను ఇప్పటికీ తలచుకుంటూ ఉంటాము - సూర్యనారాయణ వులిమిరి


షష్టి పూర్తి పాట  
రచన: శ్రీ మురళి అహోబిలవఝ్ఝల 


ప.  అమృతమూర్తులు, దైవ స్వరూపులు అమ్మా, నాన్నా మీరు
     మీ పద పూజా భాగ్యము మాకు  జన్మజన్మల సుకృతమూ             
     జన్మజన్మల సుకృతమూ                                                 ||అమృత||

చ. గీతా ధర్మము పాటించి, గీతా తత్వము బోధించి (2)
    విద్యాబుద్ధులు నేర్పించి, ధర్మాధర్మము వివరించి (2)
    మముగని పెంచిన మా యిలవేల్పులు అమ్మా, నాన్నా మీరు
    మీ పద పూజా భాగ్యము మాకు
    జన్మ జన్మలా తపబలమూ (2)                                          ||అమృత||

చ. సత్యవచనమే బలమని చెప్పి, గుణమే ఆభరణమ్మని తెలిపి (2)
    ఎదుటి వ్యక్తిలో లోపములెంచక గౌరవించు ఔన్నత్యము నేర్పి (2)
    మముగని పెంచిన మా యిలవేల్పులు అమ్మా, నాన్నా మీరు
    మీ పద పూజా భాగ్యము మాకు
    జన్మ జన్మలా సుకృతమూ (2)                                          ||అమృత||

చ. చదువులు, పదవులు వేరైనా, మా ఉద్యోగాలు ఏవైనా (2)
    అమ్మా, నాన్నా మా అందరికి మీ పదధూళే పదివేలు
    దీవెనలే శ్రీరామరక్షలు
    మముగని పెంచిన మా యిలవేల్పులు అమ్మా, నాన్నా మీరు
    మీ పద పూజా భాగ్యము మాకు
    ఎన్నో జన్మలా సుకృతమూ (2)                                         ||అమృత||

8 కామెంట్‌లు:

  1. చక్కని సాహిత్యం
    మీరు పాడిన ఆడియో కూడా పోస్ట్ చేస్తే బాగుండేది
    అభినందనలు

    రిప్లయితొలగించండి
  2. ఆత్రేయ గారికి, ధన్యవాదాలు. ఆడియో అందించే ప్రయత్నంలో వున్నాను. ఇది మొదటిసారి పాడినపుడు ఎటువంటి రికార్డింగు చేయలేదు. మీ సూచనకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  3. సూర్యలక్ష్మిగారు, ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాతగారికి, ధన్యవాదాలు. చాల సూక్ష్మమైన తేడా చక్కగా గమనించారు. పదింతలు తేడా వస్తుందికదా. అది సవరించాను.

    రిప్లయితొలగించండి
  5. MIMICRI JAGADEESH CHITTOOR AP 517001 YOUR SONG IS EXCELLENT AND THE SONG SHOW HOW YOU ARE LOVING YOUR PARENTS .

    రిప్లయితొలగించండి

Blog Junctions