రంగనాయకి (శ్రీరంగం) |
అయితే నాకు ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. ఈ గీతం 'సరస్వతి' గురించా? లేక 'లక్ష్మి' గురించా? అని. ఎందుకంటే వీణ ఉండేది సరస్వతి కి కదా! అందుకే 'వీణాపాణి' అన్నారు. అంతే కాకుండా గీతం చివరలో 'జయవాణి' అని ముగిస్తారు. కాని, గీతంలో స్తుతించే దేవిని 'రంగ నాయకి' అని అభివర్ణిస్తారు. అంటే శ్రీ రంగనాథుని పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీ శ్లోకం లో కూడా "శ్రీ రంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం" అని వర్ణన ఉంది. ఈ గీతాన్ని దాని అర్థాన్ని పరిశీలిద్దాం.
రాగం: మోహన
తాళం: రూపక
వరవీణా మృదుపాణి వనరుహ లోచను రాణి
సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి
నిరుపమ శుభగుణలోల నిరత జయాప్రదశీల
వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జనని జయ జయ జయ జయవాణి
వరవీణ = వరము గా గలిగిన వీణ; మృదు = సున్నితమైన; పాణి = చేతులు (దాల్చి); వనరుహ = [వన = వనము/నీరు + రుహ = పుట్టిన] పద్మం; లోచను (నయనాలు/కళ్ళు); రాణి (రాణి); సురుచిర = వంకీలు తిరిగిన; బంభర = తుమ్మెదల వంటి; వేణి = కురులు; సుర = దేవతలచే; నుత = స్తుతించబడ్డ; కల్యాణి = శుభ గుణములు కలది; నిరుపమ = (ఉపమ = సామ్యం; నిరుపమ = సామ్యం లేని); శుభ = మంచి; గుణ = లక్షణాలు; లోల = కలిగినది (స్త్రీ); నిరత = ఎల్లప్పుడూ; జయ = విజయమును; ప్రద = ప్రసాదించే; శీల = స్త్రీ; వరద = వరములిచ్చు అంటే విష్ణువు; ప్రియ = ఇష్టసఖియైన; రంగనాయకి = శ్రీ రంగనాథుని సతి అయిన లక్ష్మీ దేవి; వాంఛిత = కోరిన; ఫల = ఫలములు; దాయకి = ఇచ్చునది (స్త్రీ); సరసీజాసన = [(సరసిజ + ఆసన; సరసిజ = సరసులో పుట్టినది, పద్మం; పద్మం ఆసనంగా గలవాడు అంటే బ్రహ్మ; జనని = తల్లి; బ్రహ్మ తల్లి అంటే లక్ష్మి; జయ = విజయము; వాణి = వాక్కు గలది.
తాత్పర్యము: వర వీణను తన మృదువైన చేతుల దాల్చిన పద్మలోచనుని (విష్ణుని) రాణియై, తుమ్మెదల వంటి వంపులు తిరిగిన కురులు గలిగి, దేవతలచే స్తుతించ బడిన, శుభ గుణములు గలది, సామ్యం లేని మంచి లక్షణాలు గలిగి, ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే స్త్రీ, వరదుని (విష్ణుని) ఇష్ట సఖియైన రంగనాయకి (శ్రీ రంగని పత్ని) అయి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే బ్రహ్మకు తల్లి అయిన లక్ష్మీ దేవి జయాన్ని ప్రసాదించు గాక!
శ్రీ రంగం లోని రంగనాయకి చిత్రం ఈ బ్లాగులో ఇవ్వడమైనది. తమిళం లో అలమేలు మంగను 'తాయారు' అని వేంకటేశుని 'పెరుమాళ్' అని అంటారు.
ఆ విధంగా ఈ శ్లోకం శ్రీ లక్ష్మీ దేవిని స్తుతించేది అయినా, వరవీణ, జయవాణి పదాలకు లక్ష్మికి గల సంబంధం నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే చెప్పగలరు.
చక్కటి శ్లోకాన్ని, తాత్పర్యంతోసహా పరిచయం చేశారు. కృతజ్ఞతలు. ఇలాంటివి మరిన్ని వ్రాయాలని కోరుతూ...
రిప్లయితొలగించండితేజస్వి
తేజస్వి గారికి ధన్యవాదాలు. మరిన్ని వివరణలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిశ్రీరంగని నాయికిని చూపించారు.. ధన్యులమయ్యాం.
రిప్లయితొలగించండినాకు సంగీత జ్ఞానం లేదు..కాని వరవీణా..నిన్నుకోరి..మొదలైనవి విన్నాను.
సంగీతం కదా సరస్వతీ ప్రార్థననే అనుకునే వాన్ని..శ్రీ పురందరదాస కృతమని కూడా తెలియదు.
ధన్య వాదాలు.
సత్య గారికి. ధన్యవాదాలు. మీకు ఈ రచన నచ్చినందుకు సంతోషం.
రిప్లయితొలగించండితాత్పర్యాన్ని చూస్తే లక్శ్మి లక్ష్మీ దేవి గురించే అనిపిస్తోంది.. చాల బావుంది సర్!
రిప్లయితొలగించండిలక్ష్మీ దేవి గురించి నాకు ఒక ఇష్టమైన శ్లోకం...
రిప్లయితొలగించండిసముద్ర వసనే దేవి
పర్వతస్థన మండలే
విష్ణుపత్నీ నమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వమే
-Sreenivas
symphony గారికి ధన్యవాదాలు
రిప్లయితొలగించండిశ్రీరంగం మహాలక్ష్మిని చూపారు ధన్యవాదములండీ
రిప్లయితొలగించండిమరి లక్ష్మీ దేవికి చేతిలో కమలాలు తప్ప
వీణ చేతిలో ఉండే చిత్రం మనం ఎప్పుడూ చూదలేదు కదా
మరి పురంధరదాసులవారు..ఇలా వ్రాయడంలో కల కారణం ?
వివరంగా చెపుతారండీ సూర్యనారాయణ గారు
మీ బ్లాగులో బోలేడు విషయాలు తెలుసుకోవడం జరిగింది ఇవాల
చాలా థాంక్స్ అండీ మీకు :)
ప్రేమతో
శక్తి
శక్తి, ఈ ప్రశ్నకు నాకు కూడ సమాధానం తెలియదు. తెలిసిన చాలమందిని, అందులో సంగీతం మాస్టార్లను కూడ అడిగాను. వారికి తెలియదన్నారు. తెలిసినాక మళ్ళా పోస్టు చేస్తాను. మీ ఆసక్తికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశుద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి
రిప్లయితొలగించండిశ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న భవ సర్వదా అని విన్నప్పుడు నేనూ ఇలాగే అనుకుంటా ..లక్ష్మీ సరస్వతులిద్దరూ ఒక్కరేనని చెప్పడమేమో!
ఎన్నెల
శ్రీనివాస్ గారూ ! " సముద్రవసనే దేవీ.... " శ్లోకం భూదేవిని ఉద్దేశించినది; లక్ష్మీదేవిని కాదు. భూమాత కూడా విష్ణుపత్ని అంటారు కదా !
రిప్లయితొలగించండి