అవి నేను తిరుపతి వెటర్నరీ కాలేజిలో మైక్రోబయాలజీ లో పోస్టు గ్రాడ్యువేషన్ చేసే రోజులు. అండర్ గ్రాడ్యువేట్లకు ఉండే గదుల కన్నా, పోస్టు గ్రాడ్యువేట్లకుండే గదులు సౌకర్యంగా ఉండేవి. రూముకి ఇద్దరు మాత్రమె ఉండేవారు. పోస్టు గ్రాడ్యువేట్ల హాస్టలు పేరు "నకుల". అండర్ గ్రాడ్యువేట్ల హాస్టలు పేరు "సహదేవ". ఈ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా! నకుల సహదేవులు గోవుల పోషణ మరియు అశ్వ పోషణ లో నిపుణులు. అంటే వేటరినేరియన్స్ అన్న మాట. అందుకే విరాట రాజు కొలువులో వారి పాత్ర గోరక్షణ మరియు అశ్వ రక్షణ.
సరే ఇక పాయింటుకొస్తే, నేను, మా రూము మేటు కే.వి.ఎల్.నరసింహారావు రూములో చాల తక్కువ మాట్లాడుకొనే వాళ్ళం. కాని మూడో వ్యక్తి వస్తే మాత్రం అయిపోయాడన్నమాటే. అందువల మేమిద్దరం రూంలో వున్నపుడు ఎవరూ రావడానికి సాహసించే వారు కారు. కాని దానికి ఒక ఎక్సెప్షన్ వుంది. మా సహ విద్యార్థి శ్రీనివాస రావు (శ్రీ.రావు) కి తనొక గొప్ప కవినని ఫీలింగు. ఎప్పుడూ తన తాజా తాజా కవితలతో కనిపించిన వాళ్ళనందరినీ వినమని వేధించే వాడు. "ఏయ్! గురూ ఈ రోజు ఒక కొత్త కవిత వ్రాసాను" అని ఉదయాన్నే ప్రత్యక్షమయే వాడు. కొన్నాళ్ళు భరించాం. కాని ఇక లాభం లేదని, ఒకరోజు మెస్సులో రెచ్చిపోవడానికి ప్రయత్నించాగానే, కే.వి.ఎల్. కొంచెం విసుగుతో " ఏంటయా నీ కొత్త కవిత" అనేసరికి శ్రీనివాసరావుకి ఉత్సాహం వచ్చింది. వెంటనే అందుకున్నాడు. "నా ప్రియురాలి నవ్వు లావా క్రేటర్ లా వుంది" అని మొదలు పెట్టేసరికి...
కే.వి.ఎల్. కి వొళ్ళు మండి "ఇదీ ఒక కవితేనా", "అయినా ఈ రోజుల్లో చంద్రముఖి అని కూడా ఎవరూ అనడం లేదు. ఎందుకంటే, నీ ప్రియురాలికి ముఖం నిండా మచ్చలున్నాయా అంటారు. మరలాటిది లావా క్రేటర్ అంటే నిండా గోతులనా అర్థం?" అని తెనాలి రామకృష్ణ లాగ అనేసరికి, శ్రీనివాస రావు కు కోపం వచ్చింది.
శ్రీ.రావు, "కవిత్వం వ్రాయడమంటే అంత సులభం కాదు", "అయితే నేనొక సమస్యా పూరణం ఇస్తాను, పూరించు" అని సవాలు చేసాడు. దానికి కే.వి.ఎల్. "ఓ! నువ్వు పూర్ణం ఇస్తే నే బొబ్బట్లు చేస్తా కవితలతో" అన్నాడు. దానికి శ్రీ.రావు.."చీకటి గుహలలో వింటున్నానే నా గుండెల చప్పుడు" ఇదే సమస్య, పూరించు అన్నాడు. దానికి కే.వి.ఎల్. "ఓస్ అంతేనా! అయితే విను" అని తడుముకోకుండా ఇలా పూరించాడు..
"శ్రీనివాసరావు కవిత్వం వినలేక,
విని చావ లేక, చచ్చి బ్రతకలేక,
అడవిలోకి పారిపోయి, చీకటి గుహల్లో
వింటున్నానే నా గుండెల చప్పుడు"
శ్రీనివాస రావుకి కోపం వచ్చినా, తమాయించుకుని "భలే చెప్పావయ్యా. అసలు నీకు ఇంత కవితా పటిమ ఉందని నాకు తెలియదు. ఏదీ ఆశువుగా ఒక కవిత చెప్పు" అన్నాడు. ఈ సారి కే.వి.ఎల్. ఒక్క క్షణం ఆలోచించి "సరే విను" అని ఇలా అన్నాడు.
"మన భాష తెలుగు,
మనకు కావాలి వెలుగు,
అని నువ్వందుకుంటే కవితా పలుగు,
మేమంతా ఒకటే పరుగు"
అని ముగించగానే మా మెస్సులో అప్పటిదాకా ఈ చోద్యం చూస్తున్న మిగిలిన విద్యార్థులంతా ఒక్కసారి చప్పట్లతో ముంచెత్తారు. కళాశాల కబుర్లు, జ్ఞాపకాలు, ఆనాటి అల్లరి పనులు గుర్తుకు వచ్చినపుడు మళ్ళీ గతంలోకి జారిపోతే బాగుండుననిపిస్తుంది. కాని ఆ మధుర క్షణాలు మళ్ళా రావుగా. అప్పటి అనుభూతులని, అనుభవాలని నెమరు వేసుకుని ముందుకు సాగిపోదాం.
:))))) Baagundandee..
రిప్లయితొలగించండివనజ వనమాలి గారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిThose good old hostel days. Nice post sury.
రిప్లయితొలగించండిThanks Ram.
రిప్లయితొలగించండిచాలా బాగుందండీ సూర్యనారాయణగారూ..!
రిప్లయితొలగించండివామనగీత గారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిThose good olden days!! Good one Suri garu.
రిప్లయితొలగించండిSymphony garu, Thanks andi.
రిప్లయితొలగించండి