16, అక్టోబర్ 2011, ఆదివారం

వేలాది మంది అభిమానించే 'జాలాది' ఇక లేరు


జాలాది (1932 - 2011)
సినీ సాహిత్యాభిమానులకు "జాలాది" గా పరిచయమైన శ్రీ జాలాది రాజారావు గారు ఎన్నో మంచి పాటలు వ్రాసారు. జానపద గీతాలు వ్రాయడంలో వారికి వారే సాటి. వారికి ఎంతో పేరు తెచ్చి, ఆయన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించి, సినీచరిత్రలో గొప్ప స్థానాన్ని కల్పించిన పాట "ప్రాణం ఖరీదు" కు వ్రాసిన "యాతమేసి తోడినా ఏరు ఎండదు".  ఇది నాకు నచ్చిన ఒక గొప్పపాట. తన సహజ జానపద శైలిలో వ్రాసిన ఈ గీతంలోని పదాలు వింటే నిత్య జీవితంలోని నగ్న సత్యాన్ని వింటున్నట్టు ఉంటుంది.  జాలాది గారు వ్రాసిన పాటలలో మరికొన్ని ప్రముఖమైనవి - చూరట్టుకు జారుతుంది సిటుక్కు సిటుక్కు వాన చుక్క (పల్లె సీమ), సీతాలు సింగారం (సీతా మా లక్ష్మి), పుణ్య భూమి నా దేశం నమో నమామి (మేజర్ చంద్రకాంత్), ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ (చల్ మోహన రంగ) మొదలయినవి.  మనందరినీ వదలి అద్దరిని చేరుకున్న శ్రీ జాలాది గారికి అశ్రు నివాళులు. మీరు దూరమైనా మీ జ్ఞాపకాల గీతాలు మా మనసులలో నిలిచి ఉంటాయండి. 


చిత్రం: ప్రాణం ఖరీదు
రచన: జాలాది రాజా రావు
సంగీతం: చక్రవర్తి
గానం: బాలు   




ప.     యాతమేసి తోడినా ఏరు ఎండదు
        పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
        దేవుడి గుడిలోనైనా, పూరి గుడిశెలోనైనా
        గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
        ఆ దీపముండదు                            ||యాతమేసి||
చ.     పలుపుతాడు మెడకేస్తే పాడియావురా
        పసుపుతాడు ముడులేస్తే ఆడదాయెరా
        కుడితినీళ్ళు పోసినా, అది పాలు కుడుపుతాది
        కడుపుకోత కోసినా, అది మనిసికే జన్మ నిత్తాది
        బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
        గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో       ||యాతమేసి||

చ.     అందరూ నడిసొచ్చిన త్రోవ వొక్కటే
        చీము నెత్తురులు పారే తూము వొక్కటే
        మేడ మిద్దెలో వున్నా సెట్టు నీడ తొంగున్నా
        నిదర ముదర పడినాక పాడి వొక్కటే వల్లకాడు వొక్కటే
        కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటదా
        ఆకలేసి అరిసినోళ్ళు  కాకులంటదా         ||యాతమేసి||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions