25, జనవరి 2011, మంగళవారం

వందనం చేసే జాతీయ గీతం వంద ఏళ్ళ చరిత్ర గలది

విశ్వకవి రవీంద్రుడు (రవీంద్ర నాథ టాగోర్) మన జాతీయ గీతమైన "జనగణమన అధినాయక జయహే! భారత భాగ్య విధాత" ను తొలుత వంగ (బెంగాలి) భాషలో, ఎక్కువగా సంస్కృత పదాలతో రచించారు. మొదటి సారిగా ఈ గీతాన్ని కలకత్తా లో 1911 డిసెంబరు 27 న జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం లో పాడటం జరిగింది. అయితే ఈ జాతీయ గీతాన్ని జనవరి 24, 1950 లో అధికారికంగా జాతీయ ప్రతిపత్తి కల్గించారు. అంటే ఇప్పటికి సుమారు వంద సంవత్సరాల క్రిందట పుట్టిన ఈ గీతం జాతీయత సంతరించుకుని సుమారు ఆరు దశాబ్దాలు అయింది అన్నమాట. జనవరి 26 కు శ్రీ భీంరావ్ రాంజీ అంబేద్కర్ సమకూర్చిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఆ దినం "గణతంత్ర దినం" (Republic Day) గా పరిగణన లోనికి వచ్చింది.

తెలుగు నేల పై జాతీయ గీతం స్వరకల్పన:

అయితే చెప్పుకో దగ్గ విషయం ఏమిటంటే ఈ జాతీయ గీతాన్ని బెంగాలీ భాష నుండి ఆంగ్లంలోకి అనువదించడం,  స్వరపరచడం తెలుగు నేల పై జరిగాయి అని ఎందరికి తెలుసు?  నాకు ఈ మధ్యనే తెలిసింది. ఎక్కడ అంటే చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో.   ఇక్కడ గల "అనీబిసెంట్ థియోసాఫికల్ సొసైటీ" లో పాస్టర్ అయిన జేమ్స్ కజిన్స్ అనే ఆయన ఆహ్వానం మీద టాగోర్ గారు ఆంద్ర ప్రదేశ్ ను సందర్శినారట.  వారు మదన పల్లి  (చిత్తూరు జిల్లా) కు వచ్చారని వార్త. టాగోర్ గారు తెలుగు నేలను దర్శించినపుడు మన జాతీయ గీతానికి ఆంగ్ల అనువాదం చేసారు. అదే సందర్భంలో జేమ్స్ కజిన్స్ గారి శ్రీమతి అయిన మార్గరెట్ కజిన్సు తో కలసి జాతీయ గీతానికి స్వరకల్పన చేసారని వికి పీడియా సమాచారం. ఇది నిజంగా తెలుగువారమైన మనందరమూ గర్వించ దగ్గ విషయం.

ఘంటసాల గళం లో మన "జనగణమన" 

నేను చిన్నప్పటి నుండి ఘంటసాల అభిమానిని. ఆయన పాడిన సినిమా పాటలు, ప్రైవేటు గీతాలు చాల విన్నాను. అయితే వారి గళంలో జనగణమన వినడం ఈ మధ్యనే తటస్థించింది. అది "ప్రాజెక్ట్ ఘంటసాల" ద్వారా శ్రీ బొల్లా ప్రగడ సోమేశ్వర రావు గారి ఇ-లేఖ ద్వారా. అప్పటి వరకు ఘంటసాల గారి గళంలో జనగణమన విని ఎరుగను.  చాల మందికి తెలిసే ఉండవచ్చు.  ఘంటసాల గారు పాడిన జాతీయ గీతం ఆడియో ను క్రింది లంకె లో వినవచ్చును. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions