13, జనవరి 2011, గురువారం

ఈ రోజే స్వామి వివేకానంద జయంతి.

(1863-1902)
యావత్ భారత జాతి గర్వించ దగ్గ మహా మనీషి శ్రీ స్వామి వివేకానంద.  ఈ రోజే (జనవరి 12) ఆ మహాత్ముని జయంతి.  అద్భుతమైన జ్ఞాపక శక్తి గల వేదాంత జిజ్ఞాసి, పరమత సహన పిపాసియైన ఈ వంగ నందనుడు శ్రీ రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. గురు శుశ్రూష లో అద్వైత వేదాంతాన్ని నేర్చి, మానవ సేవయే మాధవ సేవయని గ్రహించాడు. సంచరించే సన్యాసియై జన జీవన స్రవంతిలో కలసి దేశ స్థితి గతులను తెలుసుకొన్నాడు.  శ్రీ వివేకానందుడు తన వాక్పటిమతో 1893 లో అమెరికా లోని చికాగో నగరంలో విశ్వ వేదిక పై సర్వమతసమాఖ్య (Parliament of Rligions) లో "అమెరికను సోదర సోదరీమణులారా" అని సంబోధిస్తూ తన ఉపన్యాసం లో హిందూ మతం యొక్క స్థాయిని ప్రపంచ మతాలకు సరిగా సూచించి భారత జాతికి ఎనలేని ఔన్నత్యం తెచ్చి పెట్టాడు.  అచిరకాలం జీవించినా భారతావనికి అంతులేని జ్ఞాన సంపదను ఇచ్చి, వేదాంత ప్రాభవాన్ని కలిగించాడు.          

శ్రీ వివేకానందుని కొన్ని హితవచానాలు ఈ దిగువన చూడగలరు.

  • "ఆత్మకు అసాధ్యమైనది ఏదైనా ఉందని ఎన్నడూ అనుకోవద్దు. అది ఒక పెద్ద అపోహ". 
  • "మనము గాని, ఇతరులు గాని బలహీనులని చెప్పడం అంత పాపం ఇంకొకటి లేదు". 
  • "మన గురించి మన ఆలోచనలే చెప్తాయి. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నామో అన్నది చాల ముఖ్యం". 
  • మాటలు ప్రత్యామ్నాయాలు మాత్రమే, కాని ఆలోచనలు శాశ్వతమైనవి. అవి చాల దూరం ప్రయాణిస్తాయి".
  • "నిన్ను నీవు నమ్మనంత వరకు దేవుడ్ని నమ్మలేవు".
  • "ఈ ప్రపంచం ఒక పెద్ద వ్యాయామ శాల. మనలను బలవంతులను చేసుకోవడం కోసం ఇక్కడకు వస్తాం". 
  • "నీ హృదయం లోను, ప్రతి జీవిలోనూ గల దేవుడ్ని చూడలేని నీవు ఎక్కడికి వెళ్లినా దేవుని చూడలేవు".
  • "లెమ్ము. మేల్కొనుము. నీ గమ్యం చేరే వరకు ఆగకుము".
  • "ప్రపంచం లోని శక్తి అంతా మన వద్దనే వుంది. కానీ మనమే మన కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని లోకమంతా చీకటిగా వుందని విలపిస్తున్నాం". 
  • "మన బలమే మన జీవితం. మన బలహీనతే మన మృత్యువు".
  • "నీపై నీకు నమ్మకం ఉంచు. నీ అభిమతానికి నిజంగా కట్టుబడి ఉండటమే నిజమైన మతం".
  • "మీకు తెలుసా! నేను మళ్ళీ పుట్టాలేమో! ఎందుకంటే, నేను మానవాళి ప్రేమలో పడ్డాను". 
  • "ప్రతి ఒక్కరినీ వారి అత్యంత ఉన్నతమైన ఆశయ సాధనలో ప్రోత్సహించడం మన ధర్మం. అంతేకాక దానిని సత్యానికి దగ్గరగా తోడ్కొని పోవడంలో మనం సహకరించాలి". 
  • "విషయ వాసనలకు చలించని వాడే, అమరత్వాన్ని సాధించిన వాడు".
  • "నీ జీవితాన్ని అందరి మంచి కోసం, అందరి సుఖం కోసం వెచ్చించడమే నిజమైన మతం. నీ కోసం నీవు చేసుకునేది మతం కాదు".
  • "ఒక ఆలోచన మనసును ఆవరించినపుడు అది భౌతిక లేకా మానసిక స్థితి లోకి రూపాంతరం చెందుతుంది". 
      మనకు ఎందఱో ప్రవక్తలు, ప్రభోతలు ఎన్నో మంచి మార్గాలను చూపించారు. నిజంగా భారతీయులు ఎంత అదృష్టవంతులు. కాని మనం ఎంత వరకు వీరి బోధలను ఆచరిస్తున్నాము.  అంతా గొప్పలు చెప్పుకోవడానికే, గాని ఆచరణలో చాల వెనుకబడి ఉన్నాం. ఒకప్పుడు అనే వాళ్ళం "ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి సమస్తం పర పీడన పరాయణత్వం".  ఇక్కడ పరులు కాదు మనను మనమే పీడించు కుంటున్నాము. అర్థం లేని విద్వేషాలు, అంతర్గత కలహాలు, అసూయా ద్వేషాలు మొదలయినవి మనకు నిత్య వ్యాపకాలు అయిపోయినాయి.  ఈ మత్తులో నుండి బయటపడితే గాని ఏ అభివృద్ధిని సాధించలేము. 
అమరుడైన ప్రవక్త శ్రీ వివేకానందునికి నివాళులు అర్పిస్తూ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions