5, డిసెంబర్ 2010, ఆదివారం

అమర గాయకునికి అశ్రు నీరాజనం

అమర  గాయకుడు శ్రీ ఘంటసాల 88 వ జన్మదినం సందర్భంగా ఆ మహానుభావుణ్ణి తలచుకొంటూ నా 'స్వగతం' లో అనుకునే భావాల కలగంపు ఈ చిరు కవిత. ఘంటసాల మనకు మిగిల్చి వెళ్ళిన మధుర జ్ఞాపకాలు కోకొల్లలు. ఎన్నటికీ తర'గని'వి. 
 
తెలుగింట మ్రోగింది జేఘంట
ప్రతిధ్వనించింది ఆ ఘంట ప్రతియింట
సాగింది నవరసాల రసహేల
ఆ హేల ప్రతిరూపమే ఘంటసాల

’స్వర్గసీమ’తో ప్రారంభించి
స్వర్గసీమను అలంకరించావు
అమృతగానమును మరపించి
గగన యానమును సల్పినట్లుండే
నీ సుస్వర పరిచయం
కాదు సుమా కలకాదు సుమా!

పద్యానికి నీవు దిద్దిన వరవడి
నవగాయక విద్యార్ధులకు చక్కనిబడి
నీ పాటశాల అందరికీ పాఠశాల
సాహిత్యానికి తగ్గ ఉచ్ఛారణ
నీ పాటలే మాకు నిత్య పునశ్చరణ
నీ పాట ఒక ప్రమాణం
నీ మాట గీతాప్రవచనం

సేదతీర్చే శాంతిగీతం,
గుండెలు పిండే విషాదగీతం
గిలిగింతలు పెట్టే హాస్యం,
కారుణ్యమొలికించే పుష్పవిలాపం
కళ్ళకు కట్టే అద్భుత వర్ణనం
గగుర్పాటు కలిగించే రౌద్రం,
భయానకం, భీభత్సం
సరసమైన శృంగారం
ఒకటేమిటి అన్నీ సమ్మిళితమే
నవరసాల నాదోపాసకుడవు

నీ గానలహిరి లాహిరి లాహిరిలో
కొండగాలి తిరిగింది మలయమారుతంలో
రసికరాజ! నీ సంగీత వాక్ఝరి శివశంకరి
శ్రీకారం చుట్టిన సంగీతాక్షరి
ఇది నీ సంగీతపటిమకు దర్పణం
నాటికీ, నేటికీ అందరికీ చర్వితచర్వణం

రాగవిపంచీ! రసాస్వాదనకు నీ పాటే నిఘంటువు
రసహృదయాలను కలిపే ఆత్మబంధువు
నీ పాటలు నిలిచాయి, నిలుస్తాయి అజరామరంగా
నీ యశస్సు ఉంటుంది ఆచంద్ర తారార్కంగా
విధి విలాసంతో యాభైరెండు నూరైంది
తెలుగింటికొక మధురగళం దూరమైంది
అమరలోకం ఆస్వాదిస్తోంది నీ మధురగానం
అమర  గాయకా! నీకిదే నా అశ్రు నీరాజనం!   

4 కామెంట్‌లు:

Blog Junctions