సినీ పరిశ్రమ లో ఎన్నో విడ్డూరాలు జరుగుతుంటాయి. ఎన్నో అతుకులతో తయారైన బొంత సగటు సినిమా. దాని మీద సమకాలీన రాజకీయ ప్రయోజనాలు, సామాజిక పరిస్థితులు, వాటి వాటి ప్రభావాన్ని చూపుతుంటాయి. ముఖ్యంగా పాటల రచయితలకు ఇచ్చే స్వేచ్చ తక్కువ. వాళ్ళు కష్టపడి వ్రాసిన పాటను అనాలోచితంగా నిర్మాతలు, దర్శకులు మార్చేస్తుంటారు. అందులో రచయితకు స్వతంత్రత ఉండదు. తీరా సినిమా పూర్తైనా ఒక్కో సారి సెన్సారు కత్తెరకు బలి అయిపోతుంటాయి. ఒకో సారి సెన్సారు వాళ్లకి అభ్యంతరం అనిపించే పదజాలం గాని, పద ప్రయోగం గాని ఉండక పోయినా ఆ బోర్డు వాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం అర్ధం లేని కత్తిరింపులు చేస్తుంటారు. మొదటి కోవకు చెందిన ఒక సందర్భం సిరివెన్నెల గారికి కూడా తప్పలేదు. అది ఆయన మాటలలోనే విందాం. పట్టుదల అనే చిత్రానికి "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి" అనే ఈ పాట సిరివెన్నెల గారు వ్రాసారు. కాని సినిమాకు అనుగుణంగా చేయడానికి దానిలోని సాహిత్యాన్ని రచయితా ఇష్టం తో ప్రసక్తి లేకుండా మార్చారు. ఇదీ మన సినీ పరిశ్రమకున్నతెగులు.
ప. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా ||ఎప్పుడూ||
చ. నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదయిన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గివుండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా
నిషా విలాసమెంతసేపురా?
ఉషొదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిదేనురా ||ఎప్పుడూ||
చ. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీదికాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణా
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా
నిరంతరం ప్రయత్నమున్నదా?
నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువున్నంతవరకు చావుకూడ నెగ్గలేక గెలుపు చాటురా ||ఎప్పుడూ||
సినిమాలో మార్చిన పాట ఆడియో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి